నెల్లూరు : అవినీతిని నిర్మూలిస్తామని పదేపదే చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏపీలో మాత్రం అవినీతికి లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం గ్రామంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నందున ప్రస్తుతం చంద్రబాబు అవసరం మోదీకి లేదన్నారు. కానీ, నరేంద్ర మోదీ మాత్రం చంద్రబాబు నాయుడ్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారో ప్రజలకు అర్థం కావట్లేదని తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు...దీని నుంచి బయటపడేందుకు నరేంద్రమోదీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి గురించి పట్టించుకోవటం లేదో ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిపై తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ఇచ్చిన మాటకు ప్రధాని కట్టుబడి ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా రాష్ట్రంలో అవినీతి అక్రమాలను అరికట్టాలని ప్రధానికి ప్రసన్నకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు, లోకేష్‌లు కలసి రాష్ట్రంలో రూ.1,44,571 కోట్ల అవినీతికి పడగలెత్తారని విమర్శించారు. ఇరిగేషన్‌లో రూ.7,000 కోట్లు దోపిడీ చేశారని... అలాగే లిక్కర్ సిండికేట్ల నుంచి రూ.6,000 కోట్లు బహుమతిగా వచ్చాయన్నారు. పవర్ ప్రాజెక్టులలో రూ.5,000 కోట్లు ముడుపులు అందుకున్నారని, ఇసుక మాఫియా నుంచి రూ.2,600 కోట్లు వసూలు చేశారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.