బుర్రిపాలెంలో పర్యటించనున్న శ్రీమంతుడి శ్రీమతి
ప్రిన్స్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బుర్రిపాలెంను దత్తత తీసుకుని... అభివృద్ధి చేసేందుకు ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగా ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత గురువారం బుర్రిపాలెంలో పర్యటించనున్నారు. ఆమె పర్యటనతో బుర్రిపాలెం బంగారమాయేనా ? ఇప్పటికైనా గ్రామానికి అభివృద్ధి దారులు తెరుచుకునేనా ? సూపర్స్టార్ మహేష్బాబు ఈ గ్రామాన్ని పూర్తిగా మార్చేయనున్నారా? ఈ ప్రశ్నలు బుర్రిపాలెం గ్రామస్తుల మెదళ్లలో మెదులుతున్న ఆశలు, ఆకాంక్షలు.తన తండ్రి కృష్ణ సొంత ఊరైనా బుర్రిపాలెం దత్తత తీసుకున్నట్లు ఏడాది కిందట ప్రకటించిన మహేష్ బాబు.. నమ్రత ద్వారా ఏ వరాలు జల్లు కురిస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు
బుర్రిపాలెం బుల్లోడు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ తన ఊరిని వెండితెరకెక్కించి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు. ఆయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు ఆ ఊరిని దత్తత తీసుకుని మరోసారి ఆ గ్రామాన్ని వార్తల్లో నిలిపారు. 'సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం' అనే సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్ బాబుకు బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అప్పట్లో ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచి బుర్రిపాలెం గ్రామం మహేష్ బాబుకు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్తోపాటు సోదరి గల్లా పద్మావతి గురువారం గ్రామంలో పర్యటించనున్నారు. దీంతో గ్రామస్తుల్లో కొత్త ఆశలు చిగురింప చేసింది.
నాటి నుంచి నేటి వరకు...
సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ, తల్లి నాగరత్నమ్మ, తండ్రి వీరరాఘవయ్య. గ్రామానికి రాజకీయంగా... సామాజికంగా వీరు సేవలందించారు. నాగరత్నమ్మ గ్రామ సర్పంచ్గా పని చేశారు. గ్రామస్తులు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఉన్నతపాఠశాల నిర్మాణానికి సొంత నిధులు అందించారు. అలాగే శ్రీకృష్ణ సాయి గీతమందిరాన్ని కూడా నిర్మించారు. ఆసుపత్రి కోసం సొంత స్థలం విరాళమిచ్చినా ప్రభుత్వం మాత్రం వినియోగించలేదు. జన్మస్థలంపై మమకారం కలిగిన కృష్ణ తన బుర్రిపాలెం అందాలను... అక్కడి రైతుల జీవన దృశ్యాలను తన సినిమాల్లో చిత్రీకరించారు. సాధ్యమైనప్పుడల్లా సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడకొచ్చి గ్రామస్తులతో గడుపుతుంటారు.