'నా చిత్రాలకు అవార్డులు ఏమీ రాలేదు'
సినీ నటుడు వేటుకూరి నరసింహరాజు
ఏలూరు : తన విలక్షణమైన నటనతో జగన్మోహిని వంటి జానపద చిత్రాల ద్వారా మెప్పించిన కథా నాయకుడు వేటుకూరి నరసింహరాజు. అప్పట్లో వాల్ పోస్టర్‌పై ఆయన బొమ్మ చూసి ప్రేక్షకులు థియేటర్‌ల వద్ద క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు. మన జిల్లాకే చెందిన ఆయన బుధవారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గణపవరం త్రిపుర రెస్టారెంట్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలిలా..
ప్రశ్న : నటనపై ఆసక్తి ఎలా కలిగింది?
జవాబు : నేను ఈ జిల్లా వాసినే. ఉండ్రాజవరం మండలం మట్లూరు మా స్వగ్రామం. మన జిల్లాకు చెందిన ఎందరో చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చదువుకునే రోజుల్లోనే నాకు సినీ రంగంపై ఆసక్తి కలిగింది. పీయూసీ చదువు పూర్తయిన వెంటనే మద్రాసు వెళ్లాను. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను పోషించడంతో నా నటనకు ఆదరణ లభించింది.
ఎన్ని చిత్రాల్లో నటించారు?
సుమారు 110 చిత్రాల్లో నటించాను. 90 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. తెలుగు చిత్ర రంగంతో పాటు తమిళంలో కూడా నటించాను.
అవార్డులు వచ్చాయా?
నా చిత్రాలకు అవార్డులు ఏమీ రాలేదు. కానీ ‘నీడ లేని ఆడది, పునాదిరాళ్లు, జగన్మోహిని, మరోమలుపు’ వంటి చిత్రాలు నా సినీ రంగ భవిష్యత్తును ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి.
ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించడానికి కారణాలేంటి?
నేటి చిత్ర పరిశ్రమ ఖర్చుతో కూడుకున్నది. యువత డ్యాన్సులు, ఫైట్‌లను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎంతో ఖర్చుతో ఇటువంటి సన్నివేశాలను జొప్పించి నిర్మించిన చిత్రాలు హిట్ కాకుంటే నిర్మాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. 1993 నుంచే చిత్ర రంగానికి దాదాపు దూరమయ్యాను. బుల్లితెర వైపుకు మొగ్గు చూపుతున్నానన్నాను. ప్రస్తుతం ‘సప్తమాత్రిక’ సీరియల్‌లో నటిస్తున్నాను.
బుల్లితెర జీవితం ఎలా ఉంది?
బుల్లి తెర ప్రవేశంతో సినీ రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. బుల్లితెర సీరియల్ రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది. ఆ రెండేళ్లు కుటుంబ పోషణకు ఎటువంటి లోటు ఉండదు. అదే సినీరంగమైతే కొంత ఇబ్బంది తప్పదు.
ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులున్నాయా?
ఆర్థికంగా నాకెలాంటి ఇబ్బందులు లేవు. సినీ రంగంలో ఎంతో మంది చిన్న కళాకారులు కడుపు నిండా భోజనం కూడా లేని దుస్థితిలో ఉన్నారు. అలా ఇబ్బంది పడేవారికి సహాయం చేయాలనేది నా లక్ష్యం. ఆ క్రమంలోనే కొంతమందితో కలిసి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ట్రస్ట్ ద్వారా సమకూరిన మొత్తంపై వచ్చే వడ్డీతో పేద కళాకారులను ఆదుకోవాలన్నదే నా లక్ష్యం.