Undrajavaram
-
తూ.గో.లో ఘోరం.. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపాటు
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పిడుగు దాటికి బాణాసంచా తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మిగతా కూలీలు ప్రాణభయంతో సమీపంలోని అరటి తోటల్లోకి పరిగెత్తారు. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మరణించిన ఇద్దరు మహిళలని, బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేసే వారిగా తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆహా ఏమి రుచి.. తేగలు తినడం వల్ల లాభాలివే..
సాక్షి, పశ్చిమగోదావరి: శీతాకాలంలో లభించే తేగలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో తేగల రుచి బావుంటుందని ప్రజలు భావిస్తారు. ఉండ్రాజవరం మండలంలో పాలంగి, చివటం, ఉండ్రాజవరం, దమ్మెన్ను, వేలివెన్నుతో పాటు పెరవలి మండలం కానూరు, ముక్కమల, పెరవలి, అన్నవరప్పాడు తదితర గ్రామాల్లో తేగల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో తేగలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తేగ బాగా ఊరటంతో పాటు రుచిగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలు ఏటా ఈసీజన్లో తేగల విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు తేగల విక్రయాలు జోరుగా సాగుతాయి. పెద్ద సైజు తేగల కట్ట రూ.50 నుంచి రూ.100, చిన్న సైజు తేగల కట్ట రూ.20 వ్యాపారులు విక్రయిస్తున్నారు. తేగల ధర అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. తేగలను కుండల్లో పెట్టి కాలుస్తున్న దృశ్యం తేగల తయారీ విధానం మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో తాటిచెట్లు నుంచి తాటికాయలు తయారైన తరువాత వాటిని సేకరించి నేలలో గుంతలు తీసి పాతర వేస్తారు. అవి మొలకలు వచ్చి తేగలు తయారువు తాయి. ఇవి ఏటా నవంబర్ నాటికి సిద్ధమవుతాయి. ఆతరువాత పాతర నుంచి తేగలను నుంచి తాటి బుర్రలను వేరే చేస్తారు. తేగలను మట్టి కుండల్లో పెట్టి కాలుస్తారు. తరువాత వాటిని కట్టలు కడతారు. వీటిని స్థానిక దుకాణాల్లో, హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తారు. ఈఏడాది తేగల వ్యాపారం మార్కెట్ ఆశాజనకంగా ఉందని విక్రయదారులు అంటున్నారు. లాభాలు తాటి కాయల నుంచి మనకు లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగ య్యేందుకు తేగలు దోహదపడతాయని కొనుగోలుదారుల నమ్మకం. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. -
సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన..
సాక్షి, ఉండ్రాజవరం: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరి విరాళం అందించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పీహెచ్సీ నిర్మాణానికి దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా రూ.3 కోట్లకుపైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. చదవండి: (వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది) ఈ నెల 21న సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణబ్రహ్మానందం, వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు శిరిగిన శివరాధాకృష్ణ, కరుటూరి శివరామకృష్ణ, గూడపాటి చెంచయ్య, శిరిగిన నర్సింహమూర్తి, ముళ్ళపూడి కేశవరావు, ఎం.కృష్ణారావు, ఎం.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. -
వేలివెన్ను వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన వీఆర్ఓ సూర్యజ్యోతిని శనివారం అధికారులు సస్పెండ్ చేశారు. మండలంలోని సచివాలయంలో ఆమె వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 27న వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బలక్ష్మి అనే మహిళా రైతుకు సంబంధించిన 42 సెంట్ల భూమి మ్యుటేషన్ కోసం 42 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. తహిసీల్దార్‌కు వీఆర్ఓపై ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీఆర్వో లంచం అడిగినట్టు విచారణలో రుజువు కావడంతో ఆమెను సస్పెండ్ చేయాలంటూ నిన్న(శుక్రవారం) కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ సూర్యజ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు) -
దొంగ దొరికాడు..
సాక్షి, పశ్చిమ గోదావరి(ఉండ్రాజవరం): దొంగతనాల్లో ఆరితేరిన పాత నేరస్తుడిని తణుకు, ఉండ్రాజవరం ఎస్సైలు కలిసి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఉండ్రాజవరం ఎస్సై అవినాష్, తణుకు రూరల్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన పులవర్తి లీలాసాయి గుప్త ఇటీవల తణుకు మండలం వెంకట్రాయపురంలో రామేశ్వరపు సురేష్ ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దీనిపై తణుకు సీఐ చైతన్యకృష్ణ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్సైలు కలిసి కేసు విచారణ చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాలంగిలో ఉన్నాడని సమాచారం తెలియటంతో వీరిద్దరూ కలిసి దాడిచేసి ముద్దాయిని గురువారం మధ్యాహ్నం పట్టుకున్నారు. దీంతో అదుపులోకి తీసుకున్న లీలాగుప్తాని విచారించగా ఇటీవల ఉండ్రాజవరం మండలం సావరం, పాలంగి గ్రామాల్లో కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు ముద్దాయి ఒప్పుకున్నాడని చెప్పారు. ఆ దొంగతనాల్లో 10 కాసులతో పాటు రెండు కాసుల బంగారం, రెండు వెండిగిన్నెలు, వెండి పట్టీలు, ఒక ఫొన్, రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముద్దాయి గతంలో పలు నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించినా మార్పు రాలేదని అందుకే తరచూ దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఉండ్రాజవరం, తణుక రూరల్ ఎస్సైలను, కేసులో సహకరించిన క్రైమ్ పార్టీ శ్రీధర్, పోలయ్యకాపు, సత్యనారాయణ, అక్బర్, మహేష్, వెలగేష్లను తణుకు సీఐ చైతన్య కృష్ణ అభినందించారు. -
ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో
-
పశ్చిమలో సెల్ఫీ వీడియో కలకలం
ఉండ్రాజవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తాను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నాని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ విషయం పోలీసులకు చేరడంతో విచారణ చేపట్టారు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన వ్యక్తి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన గొరిల్లా శివరావుగా గుర్తించారు. శివరావు ఎక్కడున్నాడో తెలియక కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శివరావు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రామ సమస్యలపై ఫిర్యాదు చేస్తే కక్ష గట్టారని శివరావు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. -
'నా చిత్రాలకు అవార్డులు ఏమీ రాలేదు'
సినీ నటుడు వేటుకూరి నరసింహరాజు ఏలూరు : తన విలక్షణమైన నటనతో జగన్మోహిని వంటి జానపద చిత్రాల ద్వారా మెప్పించిన కథా నాయకుడు వేటుకూరి నరసింహరాజు. అప్పట్లో వాల్ పోస్టర్‌పై ఆయన బొమ్మ చూసి ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టేవారంటే అతిశయోక్తి కాదు. మన జిల్లాకే చెందిన ఆయన బుధవారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గణపవరం త్రిపుర రెస్టారెంట్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలిలా.. ప్రశ్న : నటనపై ఆసక్తి ఎలా కలిగింది? జవాబు : నేను ఈ జిల్లా వాసినే. ఉండ్రాజవరం మండలం మట్లూరు మా స్వగ్రామం. మన జిల్లాకు చెందిన ఎందరో చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చదువుకునే రోజుల్లోనే నాకు సినీ రంగంపై ఆసక్తి కలిగింది. పీయూసీ చదువు పూర్తయిన వెంటనే మద్రాసు వెళ్లాను. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను పోషించడంతో నా నటనకు ఆదరణ లభించింది. ఎన్ని చిత్రాల్లో నటించారు? సుమారు 110 చిత్రాల్లో నటించాను. 90 చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. తెలుగు చిత్ర రంగంతో పాటు తమిళంలో కూడా నటించాను. అవార్డులు వచ్చాయా? నా చిత్రాలకు అవార్డులు ఏమీ రాలేదు. కానీ ‘నీడ లేని ఆడది, పునాదిరాళ్లు, జగన్మోహిని, మరోమలుపు’ వంటి చిత్రాలు నా సినీ రంగ భవిష్యత్తును ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించడానికి కారణాలేంటి? నేటి చిత్ర పరిశ్రమ ఖర్చుతో కూడుకున్నది. యువత డ్యాన్సులు, ఫైట్లను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎంతో ఖర్చుతో ఇటువంటి సన్నివేశాలను జొప్పించి నిర్మించిన చిత్రాలు హిట్ కాకుంటే నిర్మాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. 1993 నుంచే చిత్ర రంగానికి దాదాపు దూరమయ్యాను. బుల్లితెర వైపుకు మొగ్గు చూపుతున్నానన్నాను. ప్రస్తుతం ‘సప్తమాత్రిక’ సీరియల్లో నటిస్తున్నాను. బుల్లితెర జీవితం ఎలా ఉంది? బుల్లి తెర ప్రవేశంతో సినీ రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. బుల్లితెర సీరియల్ రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది. ఆ రెండేళ్లు కుటుంబ పోషణకు ఎటువంటి లోటు ఉండదు. అదే సినీరంగమైతే కొంత ఇబ్బంది తప్పదు. ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులున్నాయా? ఆర్థికంగా నాకెలాంటి ఇబ్బందులు లేవు. సినీ రంగంలో ఎంతో మంది చిన్న కళాకారులు కడుపు నిండా భోజనం కూడా లేని దుస్థితిలో ఉన్నారు. అలా ఇబ్బంది పడేవారికి సహాయం చేయాలనేది నా లక్ష్యం. ఆ క్రమంలోనే కొంతమందితో కలిసి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ట్రస్ట్ ద్వారా సమకూరిన మొత్తంపై వచ్చే వడ్డీతో పేద కళాకారులను ఆదుకోవాలన్నదే నా లక్ష్యం. -
అసలు కట్టకుంటే భార్యను ఎత్తుకెళ్తామన్నారు
తణుకు (పశ్చిమగోదావరి): వడ్డీ వ్యాపారుల వేధింపులకు మరొకరు బలయ్యారు. వేధింపులు తాళలేక పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన పాలవ్యాపారి వట్టికూటి నాగ గణేశ్ (45) ఉరివేసుకొని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తణుకులోని పాతవూరులో నివాసముంటున్న నాగ గణేశ్.. నాలుగేళ్ల కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి వచ్చి వేల్పూరు రోడ్డులో పాల వ్యాపారం చేస్తున్నాడు. కొందరు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు గణేష్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యను ఎత్తుకెళ్తామని బెదిరించారు.. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను రవి వద్ద నూటికి రూ.18 వడ్డీ కట్టేలా రూ.లక్ష అప్పు తీసుకున్నానని లేఖలో పేర్కొన్నాడు. నెల నెలా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అతడు శుక్రవారం తన ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడని, తన భార్య రామలక్ష్మితో బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడని ఆ లేఖలో రాశాడు. అసలు చెల్లించకపోతే రౌడీలను తీసుకువచ్చి తన భార్యను ఎత్తుకెళ్తానని బెదిరించాడని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు పైడిపర్రుకు చెందిన పుప్పాల శ్రీనివాసు వద్ద పది నెలల క్రితం రూ.2 లక్షల విలువైన చీటీ వేశానని, చీటీ పాటకు తనను రానివ్వడంలేదని పేర్కొన్నాడు. కనీసం కట్టిన డబ్బులైనా ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నాడని వాపోయాడు. తనకు రావాల్సిన డబ్బులు రాక, తాను డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో మానసికంగా నలిగిపోతున్నానని లేఖలో పేర్కొన్నాడు. పట్టణ ఎస్ఐ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వచ్చి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
బాణసంచా పేలి మహిళ మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద భక్తులు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా బాణాసంచా ఒక్కసారిగా పేలడంతో అక్కడే ఉన్న మహిళా భక్తురాలికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. మరో మహిళా భక్తురాలు తీవ్రంగా గాయపడింది. దాంతో దేవాలయ సిబ్బంది... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కాల్ధరి కాల్పులు గుర్తున్నాయ్
జలియన్ వాలాబాగ్ .. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో నెత్తుటి మరకల్ని మిగిల్చిన విషాద ఘట్టం. స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం అలనాడు జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన భారతీయులను బ్రిటిష్ పోలీసులు విచక్షణా రహితంగా కాల్చి చంపారు.కాల్ధరి కాల్పులు.. కరవు కోరల నుంచి పంటను రక్షించుకునేందుకు.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమించిన అన్నదాతలపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అసువులు బాశారు. మరో 11 మంది క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ఘటనలకు తేడా ఒకటే.. అది తెల్లదొరల పాలన.. ఇది నల్లదొరల ముసుగులో చంద్రబాబు పాలన.. కాల్ధరి ఘటన జరిగి 18 ఏళ్లు పూర్తి కావస్తోంది. వందలాది రైతుల వేదనను పట్టించుకోని గుడ్డిదర్బార్ వారిపై బుల్లెట్ల వర్షం కురిపించమని ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన పోలీసులు కాల్ధరి రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై విరుచుకుపడ్డారు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే కాల్పులు జరిపి అన్నదాతలను పొట్టన పెట్టుకున్నారు. ఈ విషాద ఘటన గుర్తొచ్చినప్పుడల్లా కాల్ధరి ప్రజలే కాదు.. జిల్లాలోని రైతులంతా ఉలిక్కిపడుతుంటారు. ఉండ్రాజవరం, న్యూస్‌లైన్ :అది 1996.. సెప్టెంబర్ 6.. పచ్చటి పొలాలతో.. ప్రశాంతంగా ఉండే కాల్ధరి గ్రామంలో పోలీసు తూటాలు మారణహోమం సృష్టించాయి. రైతు పోరాటాల చరిత్రలో నెత్తుటి మరకల్ని మిగి ల్చాయి. పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తం చేసేందుకు విప్లవ సింహం అల్లూరి ప్రాణాలర్పిస్తే.. ప్రజాస్వామ్యం మసుగులో నియంత నెపోలియన్లా వ్యవహరించిన చంద్రబాబు పాలనలో పోలీసు తూటాలకు రైతులనే వరి కంకులు నేలవాలారుు. చంద్రబాబు పాలనలో ఉద్యమాలంటే ఊహామాత్రంగా సహించలేకపోయేవారు. రైతుల పేరు చెబితే ఆగ్రహంతో ఊగిపోయేవారు. కరువు విలయతాండవం చేస్తుంటే.. పచ్చని పంట పొలాలు నోళ్లు తెరుచుకుని నీటితడి కోసం ఎదురుచూస్తుంటే.. పంటను కాపాడుకునేం దుకు ధర్మాగ్రహంతో రోడ్డెక్కిన రైతన్నలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం తూటాలను నజరానాగా ఇచ్చింది. నీటితీరువా, విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ శాంతియుత ఆందోళన చేస్తున్న రైతులను నిర్ధాక్షిణ్యంగా పోలీసులతో కాల్చి చంపించింది. ఈ దుర్మార్గ ఘటనలో ఆలపాటి రామచంద్రరావు (కాల్ధరి), గన్నమని కృష్ణారావు (వేలి వెన్ను) ప్రాణాలు కోల్పోయూరు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన వారిని సైతం వదిలిపెట్టకుండా తరిమితరిమి మరీ కాల్చారు. ఈ ఘటనలో మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారగా.. వైద్యులు వారిని బతికించగలిగారు. కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయ్.. పచ్చటి పంట పొలాల నడుమ ఓడిన రైతన్నల రక్తధారలు గ్రామస్తుల కళ్లముందు నేటికీ కదలాడుతూనే ఉన్నాయి. పోలీసు కాల్పుల్లో సామాన్య రైతులు ఆలపాటి రామచంద్రరావు, గన్నమని కృష్ణారావు అసువులు బాయటంతో వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లలు.. వితంతువులైన ఆడపడుచులు ఆదుకునే దిక్కులేక అల్లాడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులు, రైతు సంఘాలు ఉద్యమించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేసింది. బాధితుల కుటుం బాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించకతప్పలేదు. భర్త ఆలపాటి రామచంద్రరావు పోలీసు కాల్పుల్లో మరణించిన కొద్దిరోజులకే ఆయన భార్య భద్రమ్మ కుమారుడిని కోల్పోయి ఏకాకిగా మిగిలారు. భద్రమ్మ ఇప్పటికీ ఒంటరిగా కాల్ధరిలోని పెంకుటింట్లో బతుకు భారంగా ఈడ్చుకొస్తున్నారు. కాల్పుల్లో మరణించిన రెండో వారైన గన్నమని కృష్ణారావు వేలివెన్ను గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఆయన మరణించే నాటికి ఆ దంపతుల ముగ్గురు పిల్లలు చిన్నవారే.వారిని పెంచి పెద్దచేయడానికి భార్య తులసీ రత్నం పడిన అవస్థలు అన్నీఇన్నీకావు. అలనాటి దుశ్చర్యను ఆ కుటుంబాలు తలచుకోని రోజు లేదు. సృ్మతిపథంలో... పోలీస్ కాల్పులో అసువులు బాసిన అమర వీరుల జ్ఞాపకార్థం కాల్ధరి రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఆలపాటి రామచంద్రరావు విగ్రహాన్ని, వేలివెన్నులో చెరువు పక్కన గన్నమని కృష్ణారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అవి అలనాటి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎదిరించి ప్రాణాలను బలిదానం చేసిన ఘటనను నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నారుు. నాకు జరిగిన నష్టం ఎంతని చెప్పను 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ విషాద ఘటన ఇంకా నా కళ్లముందే మెదులుతోంది. కరెంటు చార్జీలు, నీటితీరువా తగ్గించాలని అడిగిన పాపానికి నా భర్తను ప్రభుత్వం కాల్చి చంపించింది. ఎక్స్‌గ్రేషియా అంటూ రూ.లక్ష చేతిలో పెట్టారు. కుటుంబ యజ మానిని కోల్పోయి.. చిన్న పిల్లలతో నేనుపడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. నా భర్త లేని లోటును ఏ ప్రభుత్వం పూడ్చలేదు. నా భర్త ప్రాణాలకు వెలకట్టలేరు. మేం పడిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. -ఆలపాటి రామచంద్రరావు భార్య భద్రమ్మ, కాల్ధరి -
సంక్షేమ పథకాల ఘనత వైఎస్‌దే
మోర్త (ఉండ్రాజవరం), న్యూస్‌లైన్ :దేశంలో ఎక్కడా లేనివిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి స్వర్ణయుగ పాలన అందించారని మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పేర్కొన్నారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు, సొసైటీ అధ్యక్షుడు ఆలపాటి నరేంద్రప్రసాద్ తనవర్గంతో వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి మోర్త గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సుభాష్‌చంద్రబోస్ మాట్లాడారు. దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్‌లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకువచ్చారని, వారి బాటలో ప్రజాసేవే ధ్యేయంగా నేడు వైసీపీ పయనిస్తోందని వివరించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న పార్టీ వైసీపీయేనన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి, అండగా ఉండాలని ప్రజలను కోరారు. రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డు అనంతవెంకటరమణచౌదరి మాట్లాడుతూ ఉండ్రాజవరం మండలంలో టీడీపీ కంచుకోటగా ఉన్నా, వైసీపీ ఇక్కడ ఎంతో బలపడుతోందన్నారు. రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. పార్టీలో చేరిన ఆలపాటి నరేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన నాయకత్వంలో పార్టీకి సేవచేయడానికి తన వర్గంతో వైసీపీలో చేరినట్టు చెప్పారు. పార్టీలో చేరినవారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నాయకులు చిట్టూరి నరేంద్ర, తలారి వెంకట్రావు, సువర్ణరాజు, నందిగం భాస్కరరామయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిల్లి వెంకట్రావు, పిండ్రా పోశయ్య, గుణ్ణం రవికుమార్, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.