
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
♦ చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఘటన
♦ అధ్యాపకుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు
♦ ఫర్నిచర్ ధ్వంసం చేసిన విద్యార్థులు
♦ జాతీయ రహదారిపై రాస్తారోకో
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టు సమీపంలోని నారాయణ కళాశాలలో ఆదివారం రాత్రి కమలేష్ (16) అనే ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 10.30 గంటల తర్వాత ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కళాశాలలో ఆందోళనకు దిగారు. చదువు విషయంలో అధ్యాపకుల ఒత్తిళ్ల కారణంగానే కమలేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆరోపించారు.
పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన కమలేష్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు స్టడీ అవర్‌లో సహచర విద్యార్థులతో కలసి చదువుకున్నాడు. తర్వాత హాస్టల్‌లోని తన గదికి వెళ్లిన కమలేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. యాజమాన్యం కమలేష్‌ను తిరుపతి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది.
రాత్రి పొద్దుపోయిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థులు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు. వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కళాశాల యాజమాన్యం కమలేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఎస్‌ఐ మధుసూదన్ రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.