క్రీడలు జీవితంలో భాగం కావాలి
క్రీడలు జీవితంలో భాగం కావాలి
Published Fri, Feb 24 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
-క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
-గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం
అమలాపురం/ ఉప్పలగుప్తం : క్రీడలు జీవితంలో భాగం కావాలని, అప్పుడే మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉంటాడ రాష్ట్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్ జాతీయ వాలీబాల్ ఇన్విటేషన్ మెన్, ఉమెన్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్రికెట్‌కే కాక ఇటీవల కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోందన్నారు. విశాఖలో ఏటా బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పి.వి.సింధు సాధించిన విజయంతో ఒలింపిక్ క్రీడలకు ఆదరణ పెరిగిందన్నారు. రాష్ట్రంలో మైదానాల అభివృద్ధి, క్రీడా పరికరాల పంపిణీకి ఎమ్మెల్యే, మంత్రులు కోరిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.
గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం
గొల్లవిల్లిలో రూ.కోటితో స్టేడియం నిర్మిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని గ్రామీణ క్రీడలను నిర్వహిస్తామని, రాష్ట్రంలో తూర్పుగోదావరిని క్రీడల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పారు. కోనసీమస్థాయిలో ఆరంభమైన టోర్నమెంట్‌ను ఇప్పుడు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నామంటే అందుకు గొల్లవిల్లి వాసులే కారణమన్నారు. స్టేడియంల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, అమలాపురం మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఎంపీపీ శిరంగు సత్తిరాజు, జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, టోర్నమెంట్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మద్దింశెట్టి సురేష్, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నారాయణరావు, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వై.బంగార్రాజు, ఆర్‌ఐపీఈ టి.వి.ఎస్.రంగారావు, పాల్గొన్నారు.
ఆకట్టుకున్న క్రీడాజ్యోతి ప్రజ్వలన
పోటీల ప్రారంభం సందర్భంగా క్రీడాజ్యోతిని వెలిగించిన తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఓ జ్యోతిని రిమోట్ కారులో ఉంచి మైదానమంతా తిప్పారు. ఆ జ్యోతిని క్రీడలమంత్రి అచ్చెన్నాయుడు వెలిగించి దానితోపాటు నడుచుకుంటూ ప్రధాన క్రీడాజ్యోతి వద్దకు వెళ్లి, వందలాది మంది క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య దాన్ని వెలిగించారు. క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు రాజప్ప, అచ్చెన్నాయుడు కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (వీఎఫ్‌ఐ) నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన కోర్టును చూసి క్రీడాకారులు సైతం మంత్రముగ్ధులయ్యారు.
Advertisement