నేటితో క్రీడాసంబరం పరిసమాప్తం
నేటితో క్రీడాసంబరం పరిసమాప్తం
Published Mon, Feb 27 2017 10:52 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
పాయింట్ల ఆధారంగా విజేతల నిర్ణయం
అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్‌కు సత్కారం
అమలాపురం / ఉప్పలగుప్తం (అమలాపురం) : నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్ నేషనల్ ఇన్విటేషన్ మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ పోటీలు ముగింపు దశకు చేరాయి. ఐదు సెట్లలో నిర్వహించిన ఈ పోటీల్లో మూడు సెట్లు గెలిచినవారు విజయం సాధిస్తారు. కాని మూడొంతుల మ్యాచ్‌లు ఐదు సెట్లు, నాలుగు సెట్లలోకాని ఫలితం తేలలేదు. దీంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు పోటీలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన పోటీలను పరిశీలిస్తే పురుషుల విభాగంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), వెస్ట్రన్ రైల్వే (ముంబై), పోస్టల్ (కర్ణాటక), మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), పోస్టల్ (కర్ణాటక) జట్లు విజేతగా నిలిచే అవకాశముంది. సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో సాయి (గుజరాత్)పై ఇన్‌కంట్యాక్స్ (చెన్నై) జట్టు 25–18, 27–17, 25–18 తేడాతో ఏకపక్షంగా సాగిన పోరులో విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్ మహిళా విభాగంలో ఎస్సీ రైల్వే (సికింద్రాబాద్), సాయి (గుజరాత్) జట్ల మధ్య జరగగా, ఎస్సీ రైల్వే 23–25, 25–16, 25–22, 25–22 తేడాతో విజయం సాధించింది. పోస్టల్ (కర్ణాటక) జట్టుపై వెస్ట్రన్ రైల్వే (ముంబై) జట్టు 25–16, 23–25, 27–25, 28–18 తేడాతో గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి పురుషుల విభాగంలో జరిగిన పోరులో సీఆర్‌పీఎఫ్(ఢిల్లీ) జట్టు సాయి (గుజరాత్)పై 23–25, 25–1, 25–22, 25–22 తేడాతో గెలుపొందాయి.
నేటితో ముగింపు
ఐదు రోజుల పాటు జరగనున్న ఎన్‌వీఆర్ వాలీబాల్ పోటీలు మంగళవారం రాత్రితో ముగియనున్నాయి. పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచినవారితోపాటు అన్ని జట్లకు కలిపి రూ.ఐదు లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీని అందించనున్నారు.
సాత్విక్‌కు ఘన సత్కారం
అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్‌కు ఎన్‌వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ సోమవారం రాత్రి ఘనంగా సత్కరించింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, టోర్నమెంట్ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడులు సాత్విక్‌ను సత్కరించారు. అమలాపురం జోన్ వ్యాయామోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, టోర్నీ కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, కోశాధికారి అరిగెల నానాజీ, సాంకేతిక కమిటీ సభ్యుడు ఉండ్రు రాజబాబులు ఉన్నారు.
Advertisement