ఉత్తమ నాటిక ‘చాలు ఇక చాలు’
ఉత్తమ నాటిక ‘చాలు ఇక చాలు’
Published Tue, Apr 25 2017 11:21 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు
గొల్లప్రోలు : శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో తాటిపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న 12వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్థానిక అపర్ణా కళాతోరణం, బత్తుల మురళీకృష్ణ కళావేదికపై మూడు రోజులుగా నాటిక పోటీలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ‘చాలు ఇక చాలు’, ఖాళీలు పూరించండి నాటికలను ప్రదర్శించారు. నాటిక పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, కళాభిమానుల తరలివచ్చారు.
ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు
పోటీల్లో ఉత్తమ నాటికగా కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ నాటికగా తాడేపల్లి వారి అరవింద ఆర్ట్స్ ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమనాటికగా సికింద్రాబాద్ వారి కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ఖాళీలు పూరించండి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు– కరణం సరేష్(అనంతం), ఉత్తమ నటి–సాదినేని శ్రీజ(ఖాళీలు పూరించండి) , ఉత్తమ రచన– పి.మృత్యుంజయరావు(అనగనగా..), ఉత్తమదర్శకుడు ఆర్ వాసు (అనగనగా..) ఉత్తమ క్యారెక్టర్ నటుడు బీవీ లక్ష్మయ్య(ఆగ్రహం), ప్రతినాయకుడు –పి.భద్రేశ్వరరావు(చేతిరాత ), రంగాలంకరణ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(అనగనగా..) ఆహార్యం– పి.మోహనేశ్వరరావు(అనగనగా), ఉత్తమ సంగీతం– కేఎస్‌ఎన్ రావు(పితృదేవోభవ) ఎంపికయ్యాయి. అనగనగా నాటిక ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. నాటికలకు న్యాయనిర్ణేతలుగా రాజాతాతయ్య, కట్టా కృష్ణారావు వ్యవహరించారు. విజేతలకు శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ అధ్యక్షులు పడాల రవి, ప్రధానకార్యదర్శి జక్కా సాంబశివరావు, రాజాతాతయ్య, బత్తుల వెంకటశివరామారావు తదితరులు బహుమతులు, మెమెంటోలు అందజేశారు.
కుటుంబభావోద్వేగాలను చాటిన ‘చాలు ఇక చాలు ’:
కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక కుటుంబభావోద్వేగాలను చాటింది. ఈ లోకంలో ప్రతి దానికి మితం ఉందని.. కానీ పిల్లలు ఏదడిగినా తల్లిదండ్రులు కాదు.. లేదు..కుదరదు అని చెప్పలేరని... అదే పిల్లలు ఎదిగి పెద్దవారయ్యాక తల్లిదండ్రులు ఏది అడిగినా ‘కాదు.. లేదు..కుదరదు’ అని ఎంతో సులువుగా తప్పించుకుంటున్నారనే ఇతి వృత్తంతో నాటిక సాగింది. ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగా, పీవీ భవానీ ప్రసాద్ రచించారు.
ఆలోచింపజేసిన ‘ఖాళీలు పూరించండి’..
సికింద్రాబాద్‌కు చెందిన కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది. సమాజంలో జరుగుతున్న నేరాలు..వాటి పరిణామాలను ఇతి వృత్తంగా చేసుకుని నాటిక సాగింది. రచయిత భాగవతుల ఉదయ్ నాటిక ద్వారా చక్కని సందేశమిచ్చారు.
హాస్యాస్పదంగా సాగిన‘ అంతా మన సంచికే ’..
గుంటూరుకు చెందిన గణేష్ ఆర్ట్స్‌వారు ‘అంతా మన సంచికే ’ నాటిక ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం హాస్యాస్పదంగా.. సందేశాత్మకంగా సాగింది. డబ్బు కంటే మమతానురాగాలు ముఖ్యమని నాటిక తెలియచెప్పింది.
Advertisement
Advertisement