నృత్యాంజలి సేవలు ప్రశంసనీయం
కాకినాడ కల్చరల్ : నాట్యరంగానికి నృత్యాంజలి కళానిలయం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జయలక్ష్మి కో- ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్‌లో నృత్యాంజలి కళానిలయం ఆధ్వర్యంలో ‘పద ఝురి–2017’ నాట్య కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా నటరాజ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి శాస్త్రీయ, జానపద నాట్య పోటీల్లో విద్యాంజలి నికేతన్ (కాకినాడ), లలిత కళానికేతన్ ( అన్నవరం), మంజీర నృత్యాలయం(కాకినాడ), భగవత్ నృత్యాలయం (విజయనగరం) వారే కాకుండా పలువురు పాల్గొన్నారు. టి. సౌమ్య, బి.వాణిశ్రీ, నటరాజ రామకృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యహరించారు. తదుపరి నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ పసుమర్తి శ్రీనివాసశర్మ, డాక్టర్ వేదాంతం వెంకట దుర్గా భవానిలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో నృత్యాంజలి కళానిలయం వ్యవస్థాపకుడు హరి లోకేష్ శర్మ మాట్లాడుతూ నాట్య రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. నర్తకీమణులు వి.మోహన్ సత్య, రమణ కుమారి, మధుస్మిత, శర్వాణి, సౌమ్యలకు ‘నృత్యవతంస’ పురస్కారాలను అందజేశారు. నాట్యాచార్య వీఎన్ వరప్రసాద్, శ్రీరామ్ భగవ్ గురుస్వామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే
కూచిపూడి నృత్యం : సబ్ జూనియర్స్ విభాగం ఎన్.నికిత (ప్రథమ), దీపిక (ద్వితీయ). జూనియర్స్ విభాగం ఆరది (ప్రథమ), వర్షిత (ద్వితీయ). సీనియర్స్ విభాగం జి. మేఘన (ప్రథమ), వి.శ్రీను (ద్వితీయ) స్థానాల్లో నిలిచారు. భరత నాట్యం : సబ్ జూనియర్స్ విభాగంలో డి. దివ్య హాసిని (ప్రథమ), గాయిత్రి ఆశ్రిత (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో కె. సంజన (ప్రథమ), నాగశ్రీ (ద్వితీయ), సీనియర్స్ విభాగంలో పి.ప్రసజ్ఞ (ప్రథమ), సిరిజా రెడ్డి (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు.
జానపద నృత్యం : సబ్ జూనియర్స్ విభాగంలో కె.సంస్కృతి (ప్రథమ), వినీల (ద్వితీయ), జూనియర్స్ విభాగంలో జ్ఞాపిక (ప్రథమ), సీనియర్స్ విభాగంలో భ్రమరాంబిక (ప్రథమ) బహుమతులు పొందారు.
శాస్త్రీయ నృత్యం : గ్రూపు విభాగం రోషిని గ్రూపు (ప్రథమ), అన్నవరం గ్రూపు (ద్వితీయ) బహుమతులు గెలుచుకున్నారు.
జానపద నృత్యం : గ్రూపు విభాగంలో మౌనిక గ్రూపు ప్రథమ బహుమతి, అక్షయ గ్రూపు ద్వితీయ బహుమతి పొందారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.