అంగన్‌వాడీ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం
కొత్తపేట : అంగన్‌వాడీ కార్యకర్తల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి ఎనిమిదో తేదీ) పురస్కరించుకుని స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆదేశాల మేరకు గత నెల 18న ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయిలో, 21న జిల్లా స్థాయిలో కాకినాడలో కబడ్డీ పోటీలు నిర్వహించగా కొత్తపేట ప్రాజెక్టు జట్టు జిల్లా స్థాయిలో ప్రథమస్థానం సాధించింది. జిల్లా పోటీల్లో బాగా ఆడిన ఆర్ రత్నకుమారి, బీఎస్‌ఎన్ కుమారి(కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు), శాంతి, ప్రసన్న, సుజాత, వీరమణి, తులసి, త్రివేణి(తుని ప్రాజెక్టు), గంగాదేవి (పెద్దాపుర ప్రాజెక్టు)లను రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టుగా కూర్చారు. ఈ జట్టు మంగళవారం రాష్ట్రస్థాయిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో క్వార్టర్స్‌లో పశ్చిమ గోదావరి జట్టుపై, సెమీ ఫైనల్స్‌లో చిత్తూరు జట్లపై గెలిచి, ఫైనల్స్‌లో కృష్ణా జిల్లా జట్టుపై ఘన విజయం సాధించినట్టు కొత్తపేట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ జట్టును స్త్రీ శిశుసంక్షేమ శాఖ ఆర్‌జేడీ విద్యావతి, తుని, కొత్తపేట సీడీపీఓలు వి మాధవి, బి అనంతలక్ష్మి తదితరులు అభినందించారు. ఆ టీమ్ సభ్యులకు వచ్చే నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందచేస్తారని రాజ్యలక్ష్మి తెలిపారు.