చేతులే ట్రిగ‌ర్లు..బంతులే బుల్లెట్లు | national level volley ball competetioons | Sakshi
Sakshi News home page

చేతులే ట్రిగ‌ర్లు..బంతులే బుల్లెట్లు

Published Thu, Feb 23 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

చేతులే ట్రిగ‌ర్లు..బంతులే బుల్లెట్లు

చేతులే ట్రిగ‌ర్లు..బంతులే బుల్లెట్లు

-నేటి నుంచి గొల్లవిల్లిలో జాతీయస్థాయి వాలీబాల్‌ టోర్నీ
-ఫ్లడ్‌ లైట్ల కాంతిలో అయిదురోజుల పాటు నిర్వహణ
 -అధునాతన ప్రమాణాలతో సిద్ధమైన కోర్టు
అమలాపురం / ఉప్పలగుప్తం : ఆటగాళ్లే తుపాకులవుతారు. గురినెరిగిన వాళ్ల చేతులే ట్రిగ్గర్లవుతాయి. తిన్నగా, వాలుగా, మూలగా దూసుకుపోయే బంతులే బుల్లెట్లవుతాయి. అయిదురోజుల పాటు చూసేవారికి కనువిందు చేసే క్రీడా సమరానికి సాధారణ గ్రామమైన గొల్లవిల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం వేదిక కానుంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమ్మకాయల వెంకటరంగయ్య మెమోరియల్‌ వాలీబాల్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న  జాతీయస్థాయి, వాలీబాల్‌ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలను ఫ్లడ్‌ లైట్ల కాంతిలో రేయింబవళ్లు ప్రతిష్టాత్మకంగా జరిపేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా  నిబంధనలకు అనుగుణంగా అధునాతన కోర్టు, 15 వేల మంది వరకూ పోటీలు వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో జరిగే పోటీలకు తిలకించేందుకు మíßహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషుల, మహిళ జట్లు తలపడనున్నాయి. లీగ్‌ పద్ధతిలో పోటీలు నిర్వహించి మెరుగైన పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఫైనల్‌ పోటీలను ఈనెల 28న నిర్వహిస్తారు. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది తరలి రావచ్చని అంచనా. పోటీలు జరిగే ప్రాంగణంతో బయట కూడా క్రీడాభిమానులు పోటీలు వీక్షించేలా నిర్వాహక కమిటీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాట్లు చేస్తోంది. క్రీడాభిమానులతో ఈ ఐదురోజులూ గొల్లవిల్లిలో రేయింబవళ్లు పండుగ వాతావరణం నెలకొననుంది.
 పది జట్లు.. పాటవం గల ఆటగాళ్లు
 పోటీల్లో పురుషులు, మహిళల విభాగంలో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పురుషుల విభాగంలో వెస్ట్రన్‌ రైల్వేస్‌ (ముంబాయి), ఆంధ్రా స్పైకర్స్‌ (ఏపీ) సాయి అకాడమీ (గుజరాత్‌), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (చెన్నై), పోస్టల్‌ (కర్ణాటక), సీఆర్‌పీఎఫ్‌ (ఢిల్లీ) జట్లు, మహిళా విభాగంలో జేపీఆర్‌ యూనివర్సిటీ (చెన్నై), ఎస్‌సీ రైల్వేస్‌ (సికింద్రాబాద్‌), సాయి అకాడమీ(గుజరాత్‌), కర్నాటక స్టేట్‌ జట్లు తలపడనున్నాయి. ఇంటర్‌ నేషనల్స్‌లో 10 సార్లు పాల్గొన్న ప్రదీప్‌ చెన్నై ఇన్‌కంట్యాక్స్‌ నుంచి టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియా జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల  జాతీయ క్రీడాకారులు నరేష్, కృష్ణంరాజు, సుబ్బారావు, ప్రభు, కార్తీక్‌, ఇండియా మహిళా జట్టు క్రీడాకారిణి హేమ పోటీల్లో తమ ప్రతిభ చూపనున్నారు. 
1988లో కోనసీమస్థాయితో శ్రీకారం..
గొల్లవిల్లిలో తొలిసారిగా ఉండ్రు సాంబశివరావు మెమోరియల్‌ పేరిట 1988లో కోనసీమస్థాయి వాలీబాల్‌ పోటీలు జరిగాయి.  రెండేళ్లు కోనసీమస్థాయిలో జరిగిన పోటీలు 1990లో జిల్లా స్థాయికి, 1994 నాటికి రాష్ట్రస్థాయికి చేరాయి. 2002 వరకూ రాష్ట్రస్థాయిలో జరిగాయి. తరువాత కొంత విరామం ఏర్పడ్డా 2013, 2014లలో దక్షిణభారతస్థాయిలో సలాది పల్లంరాజు మెమోరియల్‌ పోటీలు నిర్వహించారు. 2015 నుంచి నిమ్మకాయల వెంకట రంగయ్య మెమోరియల్‌ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన  పోటీల్లో పాల్గొన్న ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్నారు.వాలీబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (వీఎఫ్‌ఐ) నిబంధనలకు అనుగుణంగా పోటీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. క్రీడాకారులకు మెరుగైన వసతి, భోజనాలకు నిర్వాహక కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ పోటీలతో మాకు స్ఫూర్తి
గొల్లవిల్లిలో మూడు దశాబ్దాలుగా పోటీలు జరుగుతున్నాయి.  ఇక్కడి పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, ఎంతో మందిని చక్కటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. జాతీయ క్రీడాకారుల ఆటతీరును అవగతం చేసుకుని మెళకువలు తెలుసుకుంటాం. ఇదే కోర్టులో మేం  రోజూ ప్రాక్టీసు చేస్తాం. 
                                      -అరిగెల నరసింహారావు, యువ వాలీబాల్‌ క్రీడాకారుడు, గొల్లవిల్లి
 
 గ్రామానికి గర్వకారణం
 జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలతో గ్రామం కీర్తి దేశం నలుమూలలకూ విస్తరించడం గర్వంగా ఉంది. శివరాత్రితో పాటు జరిగే క్రీడాపోటీలకు బంధువులు రావడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో ఇదో పెద్ద పండుగ. వాలీబాల్‌ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులు పోటీపడటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
                                - చీకట్ల ఏసుబాబు, వ్యాపారి, గొల్లవిల్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement