కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
-
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నెల్లూరు(లీగల్) : పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రతినెలా జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామని సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానా అహ్మద్ జునైద్ పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన న్యాయసేవాధికారసంస్థల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సత్వర సమన్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సారి జరిగిన లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేశామని, కక్షిదారులు బాగా స్పందించారని పేర్కొన్నారు.
4 బెంచ్‌ల ఏర్పాటు
జిల్లా కోర్టు ఆవరణలో కేసుల పరిష్కారానికి 4 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా జడ్జి పాపిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి భూపాల్‌రెడ్డి, జూనియర్ సివిల్ పి.కేశవ, వాసుదేవన్‌లు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 715 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి సత్యవాణి నేతృత్వం వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లోని కోర్టుల న్యాయమూర్తు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించి 808 కేసులను పరిష్కరించారు. గూడూరు 201, కోవూరు 51, కావలి 295, ఆత్మకూరు 17, వెంకటగిరి 61, కోట 16, సూళ్లూరుపేట 91, నాయుడుపేట 21, ఉదయగిరి 55 కేసులను పరిష్కరించారు. మోటారువాహన ప్రమాద కేసులతోపాటు సివిల్, బరణం, చెక్కుల కేసులలోని లబ్ధిదారులకు రూ. 5,79,66,857 కోట్లు రూపాయలు అందేలా కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు శ్యామలాదేవి, శ్రీలక్ష్మీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టీవీ సుబ్బారావు, నగరంలోని పలు కోర్టుల న్యాయమూర్తులు, పలు సంస్థల అధికారులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు.