’కాంప్రమైజ్ నా చరిత్రలో లేదు..’
హిందూపురం అర్బన్ : ‘కాంప్రమైజ్ అనేది నా చరిత్రలో లేదు. వ్యతిరేకులతో కంప్రమైజ్ చేసుకునే మనస్తత్వం అయి ఉంటే ఇప్పటి దాకా జరిగిన ఎన్నికల్లో ఎప్పుడో ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాణ్ని.’ అని వైఎస్సార్‌సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ తీవ్రంగా విమర్శించారు. ఆయన శుక్రవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పెత్తనంకోసం పంపకాల కోసం టీడీపీలో వర్గాలు విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అది ఆ పార్టీకి సంబంధించిన విషయం అయితే అందులో వైఎస్సార్‌సీపీని లాగితే సహించేది లేదని హెచ్చరించారు. ఆదాయాన్ని పంచుకోవడంలో మనస్పర్థలు వచ్చి కొట్టుకుంటున్నారన్నారు. మున్సిపాల్టీలో 38వార్డులుంటే వైఎస్సార్‌సీపీ వార్డులకు ఒక పింఛన్ కూడా ఇవ్వలేదు.
దీంతో మాకౌన్సిలర్ అర్ధనగ్నంగా ఆందోళనలు చేయాల్సి వచ్చిందన్నారు. గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో జెండా కట్టలు కడితే పగులగొట్టారని, అభంశుభం ఎరగని మున్సిపల్ కౌన్సిలర్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులుపెట్టారన్నారు. ‘హిందూముస్లింల మధ్య జరిగిన గొడవల్లో సయోధ్య చేయడానికి వెళ్లిన మా వార్డు నాయకులు బాషాతో పాటు అప్రాంతంలో లేని కార్యకర్తలపై కేసులు పెట్టి జైళ్లకు పంపారు. నేను రాజి పడి ఉంటే ఇవన్నీ జరిగేవా?’ అని ప్రశ్నించారు. ‘పీఏశేఖర్‌తో నాకు సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అతనేవరో కూడా నాకు తెలియదు. కలిసిన సందర్భం లేదు.
ఇది చూసిన పెద్దమనిషి ఎవరో ఉంటే నిరూపిస్తే దేనినైనా సిద్ధంగా ఉన్నా’ అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు కాజేస్తున్న టీడీపీ నాయకుల తీరు గమనించి రాబోయే రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజనకార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీబ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసిఫ్‌వుల్లా, రజనీ,జబీవుల్లా, అంజినప్ప, మండల కన్వీనర్లు బసిరెడ్డి, సదాశివరెడ్డి, మహిళా కన్వీనర్ నాగమణి నాయకులు తదితరులు పాల్గొన్నారు.