ఎక్కడున్నారో... ఏమయ్యారో...
ఎక్కడున్నారో... ఏమయ్యారో...
Published Sat, Jul 23 2016 11:31 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
గోపాలపట్నం : వారు ఎక్కిన ఎయిర్‌ఫోర్సు విమానం గల్లంతై 48 గంటలు గడిచిపోతోంది... అసలు విమానం ఏమైంది... ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) తప్పిందా.... ఉంటే ఎక్కడ వాలిపోయినట్లు... విమానం కూలిపోయిందా... పడిపోతే వాటి శకలాలెక్కడున్నట్లు... వారు బతికి ఉన్నారా... ఏం జరిగి ఉంటుంది... ఇలాంటి సందేహాలు కుటుంబ సభ్యులను దహించేస్తున్నాయి. నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్‌ఏడీ)కి చెందిన 29 మంది ఉద్యోగులు చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పోర్టుబ్లెయిర్‌కి ఏఎన్–32 ఎయిర్‌ఫోర్సు విమానంలో వెళ్తుండగా మార్గంమధ్యలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఇందులో విశాఖకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇంతవరకు గల్లంతైన ఉద్యోగుల కుటుంబాల్లో కంటిమీద కునుకులేదు. తిండి సహించడం లేదు. కనీసం మంచి నీరైనా మింగుడుపడడం లేదు. వచ్చిన వారందరన్నీ పోర్టుబ్లెయిర్ నుంచి మావారు ఎపుడొస్తారంటూ ప్రా«ధేయపడడం బాధ కలిగిస్తోంది. వారి ఇళ్లలో కన్నీటితో తడిచి ముద్దవుతున్నాయి.
ఎప్పుడూ షిప్‌లోనే... ఇపుడు విమానంలో...
సాధారణంగా దూరంలో ఉన్న షిప్‌ల్లో ఆయుధ సామగ్రి మరమ్మతులు, నిర్వహణ చేయాల్సి ఉంటే ఎన్‌ఏడీ సాంకేతిక సిబ్బందిని షిప్‌లలో పంపిస్తుంటారు. విమానాల్లో పంపడం అరుదుగా జరుగుతోంది. అయితే ఎన్‌ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్‌వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్‌మహారాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావు బుధవారం విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కి బయలుదేరినా గురువారం రాత్రి వరకూ చెన్నైలోనే గడిపారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర సమయంలో చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్‌కి ఎయిర్‌ఫోర్సు విమానం అందుబాటులో ఉండడం, అక్కడికి వీరితో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు దళాలు ఉండడంతో సులువుగా వెళ్లొచ్చని భావించారు. ఆ రకంగా బయల్దేరిన కొద్ది సేపటికే ఏటీసీ(ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్) తప్పడంతో సమస్య తలెత్తింది.
అసలేం జరిగింది...
ఎయిర్‌పోర్సు విమానంలో ఉన్నది సాదాసీదా ఉద్యోగులు కారు. ఎయిర్‌పోర్సు, నేవీ, కోస్టు గార్డుదళాలు. వీరితో ఎన్‌ఏడీ ఉద్యోగులు ప్రయాణిస్తుండగా, ఏం జరిగినట్లని అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏటీసీ తప్పిందా... విమానం ఎక్కడయినా సాంకేతిక కారణాల వల్ల పడిపోయిందా...అన్న సందేహాలతో అధికారులు అన్వేషిస్తున్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో 23 వేల ఎత్తులో ఉందని ప్రచారం సాగుతోంది. ఇది అత్యవసరంగా సిగ్నల్ లేని చోటేమైనా దిగిపోయిందనా అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒక సబ్ మెరైన్, నాలుగు విమానాలు, ఒక హెలికాఫ్టరు, 15 షిప్‌లు సంద్రంలో జల్లెడపట్టాయని సమాచారం.
Advertisement
Advertisement