
అనాధాశ్రమంలో ఉన్న చిన్నారులు
గచ్చిబౌలి: ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న ఓ కేటుగాడు అనాధాశ్రమం ముసుగులో చిన్నారులను యాచకులుగా మార్చేస్తున్నాడు. మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తానని పేద తల్లిదండ్రులతో నమ్మబలికి తీసుకొస్తున్న పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నాడు. సదరు మాయగాడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రమేశ్ కుమార్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం, కొమ్మవరం గ్రామానికి చెందిన మాలిపెద్ది జేమ్స్(36) ఆర్సీపురం మండల పరిధిలోని అమీన్‌పూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని 2012లో బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నెలకొల్పాడు.
నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను మంచి చదువులు చదివిస్తానని నమ్మబలికి తన అనాథాశ్రమానికి తీసుకొస్తున్నాడు. స్థానికంగా జడ్పీహెచ్‌ఎస్, ఆర్నాల్డ్ హైస్కూల్‌ల్లో వారిని చేర్పిస్తున్నాడు. వీరిలో 10 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16న కొండాపూర్ కొత్తగూడ జంక్షన్‌లో మోహన్, శివ, కార్తిక్, అఖిల, వెంకటేశ్ అనే చిన్నారులతో భిక్షాటన చేయించాడు. బుధవారం ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు జర్కిన్ ధరించి. డొనేషన్ బాక్స్‌లు పట్టుకొని ట్రిపుల్ ఐటీ జంక్షన్, టీసీఎస్ కంపెనీ ముందు భిక్షాటన చేస్తుండగా.. బీట్ కానిస్టేబుల్ నరేందర్, దాస్ గమనించారు.
చిన్నారుల్లో ఇద్దరిని పిలిచి ఎందుకు డబ్బులు అడుగుతున్నారని ప్రశ్నించగా... బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నుంచి వచ్చామని, జేమ్స్ సార్ తమను పంపించాడని చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడని అడగగా రోడ్డు అవతలి వైపు నిల్చుని ఉన్నాడని జేమ్స్‌ను చూపించారు. అయితే, పోలీసులు తన వైపు వస్తున్నారని గ్రహించిన ఆ కేటుగాడు అప్పటికే ఇద్దరు చిన్నారులను ఆటో ఎక్కించి పంపేశాడు. అంతలోనే పోలీసులు వెళ్లి జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆర్‌సీపురం పోలీసుల సహకారంతో గచ్చిబౌలి పోలీసులు మెదక్ జిల్లా చైల్డ్ వెల్‌ఫేర్ డైరెక్టర్ చందుతో కలిసి బ్రహ్మపుత్ర ఆశ్రమంపై దాడి చేశారు.
19 మందికి విముక్తి
బ్రహ్మపుత్ర అనాధాశ్రమంలో ఉన్న 19 మంది బాలబాలికలకు విముక్తి కల్గించారు. వీరిలో ఐదుగురు అమ్మాయిలు కాగా 14 మంది అబ్బాయిలున్నారు. ఒక విద్యార్థికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో జేమ్స్ ఆ విద్యార్థిని ఇటీవలే ఇంటికి పంపేశాడని తెలిసింది. పోలీసులు తాము రెస్కూ్య చేసిన చిన్నారులను అమీన్‌పూర్‌లోని మహిమ ఫౌండేషన్‌లో ఆశ్రయం కల్పించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ , యాచక వృత్తి నిరోధక చట్టం, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేసి.. నిందితుడు జేమ్స్‌ను రిమాండ్‌కు తరలించారు.
ఖర్చు భరించలేకే భిక్షాటన: జేమ్స్
దాతలు సహకారంతోనే బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నడిపిస్తున్నానని నిందితుడు జేమ్స్ తెలిపాడు. ఆర్నాల్డ్ హైస్కూల్‌లో చదివిస్తున్న వారికి ఫీజు చెల్లించే పరిస్థితి లేక.. తప్పు అయినప్పటికీ చిన్నారులతో భిక్షాటన చేయించానని చెప్పాడు.
నిందితుడు జేమ్స్