
న్యూస్ చానల్ పెట్టిన నయీం!
గ్యాంగ్స్టర్ నయీం కార్యకలాపాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. హరిప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని సీఈవోగా నియమించి ఐ-10 న్యూస్ పేరిట నయీం చానల్ పెట్టినట్లు తాజాగా వెల్లడైంది. హరిప్రసాద్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ మేరకు వెల్లడించారు. హరిప్రసాద్ రెడ్డికి మావోయిస్టు వ్యతిరేక కథనాలు ప్రచారం చేయాలని నయీం ఆదేశించినట్లు తెలుస్తోంది.
గతంలో నయీంకు వ్యతిరేకంగా హరిప్రసాద్ రెడ్డి వార్తలు రాశాడని, దీంతో నయీం అనుచరుడు పాశం శ్రీను.. హరిప్రసాద్ రెడ్డిని నయీంతో పరిచయం చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పటి నుంచి హరిప్రసాద్ రెడ్డికి నయీంతో సంబంధాలు కొనసాగించాడని పేర్కొన్నారు. న్యూస్ చానల్ పెట్టడానికి మొదట 13.50 లక్షలు నయీం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతర ఓ మంత్రి బర్త్ డే సందర్భంగా పాట తయారుచేయించి దానికి విజువల్స్ కోసం నయీం 1.50 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. నయీం మరణానంతరం నయీం వ్యవహారాల్లో ఉపయోగించిన సెల్ ఫోన్ ను చాదర్ ఘట్ వద్ద మూసీలో పడేసినట్లు హరిప్రసాద్ రెడ్డి పోలీసులతో వెల్లడించాడు.