‘ఇందిరమ్మ’.. గిదేందమ్మా! | negligence in indiramma house scheme | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’.. గిదేందమ్మా!

Published Sun, Jul 17 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

‘ఇందిరమ్మ’.. గిదేందమ్మా!

‘ఇందిరమ్మ’.. గిదేందమ్మా!

పెండింగ్ బిల్లులు రూ.342.02కోట్లు
సకాలంలో డబ్బులు రాక లబ్ధిదారుల అవస్థలు
పునాదులు, మొండిగోడలకే పరిమితమైన 54,501 ఇళ్లు
తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్న అధికారులు

గూడు కోల్పోయి..
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు తాళ్లపల్లి లక్ష్మి. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రారంభించింది. బిల్లులు అందక మధ్యలోనే పనులు నిలిపివేసింది. ఈమె భర్త పదేళ్ల క్రితమే మరణించాడు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆమె, కొడుకు పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇల్లు మంజూరు కావడంతో తమ వద్ద ఉన్న కొంత బంగారం అమ్మి నిర్మాణం చేపట్టింది. రూ.1.50లక్షలు అప్పు తెచ్చి నిర్మాణం వేగవంతం చేసింది. స్లాబ్ వరకు వచ్చే సరికి ప్రభుత్వం లక్ష్మికి రూ.11వేలు చెల్లించింది. అవి తెచ్చిన అప్పు వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో స్లాబ్ వరకు వచ్చిన ఇంటి నిర్మాణాన్ని ఆపేసింది. బిల్లు ఎప్పుడు వస్తుందో.. ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందోనని నెలల తరబడి లక్ష్మి ఆశగా ఎదురుచూస్తోంది.

ఇందిరమ్మ పథకంలో భాగంగా మూడు దశల కింద నిరుపేద లబ్ధిదారులు జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పది నియోజకవర్గాల్లో 54,501 ఇళ్లకు.. రూ.342.02కోట్లు చెల్లించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇందులో అత్యధికంగా భద్రాచలం నియోజకవర్గానికి రూ.71.37కోట్లు, ఇల్లెందుకు రూ.45.47కోట్లు చెల్లించాలి. అయితే లబ్ధిదారులు నిర్మాణం చేపట్టిన ఇళ్లన్నీ పునాదులు, గోడలు, రూఫ్ లెవల్, స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయాయి. అప్పు తెచ్చి ఇళ్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో నిర్మాణాల మధ్య పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు పెరుగుతున్నాయి.

క్షేత్రస్థాయిలో మండలాలవారీగాా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. నెలలు గడిచినా పూర్తి కావడం లేదు. గత నిర్మాణాల్లో పలు అవకతవకలు జరిగాయని, నిర్మాణం చేపట్టిన ఇళ్లలో అర్హులకే బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఇతర అధికారిక పనులు ఉండడంతో ఇళ్ల తనిఖీలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో తమ బిల్లులు ఎప్పుడోస్తాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

 ఉన్న గూడు కూల్చేసి..
ఇంటి నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో గతంలో ఉన్న గూడును లబ్ధిదారులు తొలగించి.. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం బిల్లుల మంజూరు నిలిపివేయడంతో ఏమి చేయాలో పాలుపోక మొండి గోడలపైనే రేకులు వేసుకుని నివసిస్తున్నారు. కొందరు లబ్ధిదారులు బిల్లులు వస్తాయనే ఆశతో కొంత అప్పు తెచ్చి.. సగం వరకు ఇళ్లు నిర్మించినా.. బిల్లులు రాకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నాళ్లిలా ఉండాలని సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. అధికారులు, సిబ్బంది మాత్రం త్వరలోనే వస్తాయంటూ సమాధానమిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో లబ్ధిదారులు వినతులు ఇస్తున్నా.. బిల్లులు మాత్రం రావడం లేదు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోయింది.

 తొలి విడత 24,433 ఇళ్లకే..
నెలల తరబడి అధికారులు లబ్ధిదారుల ఇళ్లను తనిఖీ చేసి.. ప్రభుత్వానికి నివేదిక పంపారు. తొలి విడతగా కేవలం 24,433 ఇళ్లకే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ డబ్బులు ఎప్పుడు తమ ఖాతాలో పడతాయోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నా.. వారి ఇళ్ల తనిఖీలు ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో కూడా రాజకీయ ప్రమేయంతో అధికారులు ముందుగా కొందరు లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, కొన్ని గ్రామాల్లో అసలైన లబ్ధిదారుల ఇళ్లను తనిఖీ చేయకుండానే వదిలేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement