నేనెళ్లి పోతా
-
బదిలీ కోసం కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రయత్నాలు
-
నెలాఖరులో బదిలీ అవకాశం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కమిషనర్ కె.వెంకటేశ్వర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి సొంత జిల్లా కావడం, అధికార పార్టీలోని వర్గ రాజకీయాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా తనను విజయవాడ, గుంటూరు కు కానీ, మున్సిపల్ పరిపాలనా విభాగానికి కానీ బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి చక్రధర్‌బాబును కార్పొరేషన్ కమిషర్‌గా తెచ్చారు. పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనుల విషయంలో తనను ఏ మాత్రం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయనతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్పొరేటర్లు కూడా చక్రధర్‌బాబును వ్యతిరేకించడంతో ఆయన్ను సాగనంపారు. ఆ తర్వాత పీవీవీ ఎస్ మూర్తిని కమిషనర్‌గా తెచ్చారు. కార్పొరేషన్‌కు ఉన్న బకాయిలు చెల్లించే వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేయర్ వ్యతిరేకించారు. పరిపాలనా వ్యవహారాల విషయంలో ముక్కు సూటిగా వెళ్లడంతో మేయర్ మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ను కూడా బదిలీ చేయించారు. గుంటూరులో రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వర్లును ఆర్నెల్ల కిందట కిందట కమిషనర్‌గా తెచ్చారు. రెండు నెలల కిందట జరిగిన ఏసీబీ దాడులు కమిషనర్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి. మంత్రి నారాయణ ఆయన మీద అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో మంత్రితో మేయర్‌కు, మేయర్‌తో ఆనం వివేకానందరెడ్డికి ఉన్న విభేదాలు కూడా పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒకరు ఉత్తరం అంటే ఇంకొకరు దక్షిణం అనే పరిస్థితి ఉంది. ఎవరు చెప్పింది చేయాలో అర్థం కాక కమిషనర్ ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణంలో తాను పనిచేయలేననీ ఇంకో చోటికి బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నెలాఖరులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు ఉంటాయనీ, ఈ జాబితాలో వెంకటేశర్లు బదిలీ అవుతారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.