రూ.20 కోట్లతో స్వర్ణాల చెరువు అభివృద్ధి
-
నెల్లూరును మెగా సిటీగా చేస్తా
-
నెల్లూరీయులు భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు
-
బారాషహీద్ దర్గా అభివృద్ధికి హుండీలో కానుకలు వేయండి
-
సీఎం చంద్రబాబు నాయుడు
సాక్షి ప్రతినిధి – నెల్లూరు / పొగతోట/ నెల్లూరు అర్బన్ : నెల్లూరు స్వర్ణాల చెరువు అభివృద్ధికి రూ.8 కోట్లు ఖర్చు చేశామని, రాబోయే రోజుల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం సాయంత్రం బారా షహీద్ దర్గాను దర్శించుకున్న సీఎం చెరువులో రొట్టెలు పట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వర్ణాల చెరువును కేవలం రొట్టెల పండుగ సమయంలోనే కాకుండా ప్రతి రోజు యాత్రికులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నగరాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లా పరిశ్రమలకు అనుకూలంగా ఉందని, విశాఖ– చెన్నయ్, చెన్నయ్– బెంగుళూరు కారిడార్‌లు జిల్లా మీదుగా వెళ్లడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. దీనివల్ల భవిష్యత్తులో జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాల కోసం ఇక్కడి వారు ఎక్కడికీ వెళ్లాల్సిన పని ఉండదన్నారు. కృష్ణపట్నం పోర్టు వల్ల రాబోయే రోజుల్లో ఉపాధి, పారిశ్రామిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. జిల్లాలో ఇప్పటికే 14 కొత్త పరిశ్రమలు వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రావడానికి జిల్లా అనుకూలమైన ప్రాంతమన్నారు. సముద్ర తీరం ఆసరాగా చేసుకుని జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రూ.350 కోట్లతో పనులు జరుగుతున్న పెన్నా– సంగం బ్యారేజీ నిర్మాణం మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించామని, భవిష్యత్తులో మరింత ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. బారా షహీద్ దర్గా ఎంతో శక్తిమంతమైనదన్నారు. దర్గా అభివృద్ధికి హుండిలో తాను కానుకలు వేశానని, మీరు కూడా వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. దర్గా అభివృద్ధి కోసం మేయర్ అజీజ్ తన ట్రస్టు ద్వారా రూ.20 లక్షలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నెల్లూరీయులు ప్రపంచ వ్యాప్తంగా హోటళ్లు నడుపుతున్నారని, రాబోయే రోజుల్లో వీరి ఆధ్వర్యంలో హోటళ్ల రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం రొట్టెను అందుకున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్ధా రాఘవరావు, మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, బీద మస్తాన్‌రావు, తాళ్లపాక రమేష్‌రెడ్డి, తాళ్లపాక అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.