మీకు భాగం ఇచ్చాం కదా
-
టౌన్‌ప్లానింగ్ అధికారిని నిలదీసిన సస్పెండ్‌కు గురైన అధికారులు
-
కార్పొరేషన్‌లో మరోసారి తెరపైకి టౌన్‌ప్లానింగ్ వ్యవహారం
నెల్లూరు నగరపాలక సంస్థ ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఒక వివాదం పోతే మరొకటి వెంటనే రంగ ప్రవేశం చేస్తుంది. తాజాగా టౌన్‌ప్లానింగ్‌లో ఓ వ్యవహారం రచ్చకెక్కింది. రెండు నెలల క్రితం సస్పెండ్ అయిన అధికారులకు ఓ అధికారికి చోటుచేసుకున్న వాగ్వాదం కార్పొరేషన్‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
నెల్లూరు, సిటీ : కార్పొరేషన్ పరిధిలో 2015 సంవత్సరం డిసెంబరు వరకు నిర్మించిన అక్రమ భవనాలను క్రమబద్ధీకరించేందుకు బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కింద ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే 2016 జనవరి తర్వాత సుమారు 300 అక్రమ నిర్మాణాలు జరిపినట్లు టాఫ్క్‌ఫోర్స్ బృందం తేల్చింది. ఈ క్రమంలో అక్రమ భవన నిర్మాణాలకు బాధ్యులైన ఏడుగురు టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తొలగిస్తూ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ జీవీ రఘు ఉత్తర్వులు ఇచ్చారు.
ఏం జరిగింది
టౌన్‌ప్లానింగ్‌లో ఈ విషయం అంతటితో అయిపోయిందని అనుకున్న తరుణంలో నాలుగురోజుల క్రితం వేటుకు గురైన వారిలో కొందరు టీపీఎస్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు అప్పటి టౌన్‌ప్లానింగ్ ఇన్‌చార్జి అధికారిగా వ్యవహరించిన టీపీఓ సుధాకర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అప్పుడు మీకు వాటాలు ఇచ్చాం కదా.. కానీ ఒక్క మెమో కూడా మీకు రాలేదు. ఉన్నతాధికారులతో మీరు లాలూచీ అయినట్లుగా స్పష్టం అవుతోంది. మేం మాత్రమే బలయ్యాం.. మీరు పైస్థాయిలో చక్రం తిప్పి మాకేం సంబంధంలేదని చెప్పడం సరికాదని’ చెప్పారు. ‘నేను కావాలని చేయలేదు.. మంత్రి ఆదేశాలతో జరిగింది’ అని సుధాకర్ వారితో చెప్పారు. ఈలోగా మిగిలిన ఉద్యోగులు సర్దుబాటు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కార్పొరేషన్లో చర్చనీయాశంగా మారింది.
ఆ అధికారిపై చర్యలేవీ?
అక్రమ భవనాల నిర్మాణాల సమయంలో టౌన్‌ప్లానింగ్ సిటీ ప్లానర్ ఇన్‌చార్జిగా సుధాకర్ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై ఆయనకు సంబంధం లేనట్టుగా మిగిలిన వారిని సస్పెండ్ చేయడంతో వివాదం రాజుకుంది. సుధాకర్ ఆదేశాల ప్రకారమే తాము భవనాలకు మంజూరు చేయడం జరిగిందని, విధుల నుంచి సస్పెండ్ అయిన వారు చెబుతున్నారు. అయితే ఆయనకు ఒక్క మెమో జారీచేయలేదు. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.