దూరమైన ‘నేస్తం’
-
పంపిణీకు నోచుకోని న్యాప్‌కిన్లు
-
ఆరంభశూరత్వంగా మిగిలిన పథకం
బాలాజీచెరువు(కాకినాడ) :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం 2012లో నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. రుతు సమయంలో కౌమర బాలికలకు న్యాప్‌కిన్లను ఉచితంగా అందించేవారు. 2012–13, 2013–14 విద్యాసంవత్సరంలో వీటిని పంపిణీచేశారు. ఆయా పాఠశాలల్లో ఉపా«ధ్యాయినులకు దీని నిర్వహణ బాధ్యత వహించేవారు. అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అనారోగ్యం బారిన పడుతున్న పేద విద్యార్థినులకు ఈ పథకం ఓ వరంగా ఉండేది. ప్రస్తుతం ఈ పథకం దూరమైంది.
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,7,8, తరగతులు చదువుతున్న విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాప్‌కిన్లు మంజూరు చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయినుల ఆధ్వర్యంలో అవసరమైన వారికి అందజేసేవారు. ఉచితంగా ఇవ్వడంతో పాటు, వాటి వినియోగంపై అవగాహన కల్పించేవారు. రెండేళ్ల పాటు మంచి ఫలితాలను ఇచ్చిన ఈ పథకం ప్రస్తుతం మూలన పడింది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు ఉపయోగపడేలా ఉన్న ఈ పథకాన్ని మరలా ప్రారంభించేలా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆరంభం శూరత్వమే...
ప్రభుత్వ పథకాల లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నా ఆచరణలో చాలా వరకు విఫలమవుతుంటాయి. ఘనంగా ప్రారంభిస్తున్న పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో క్రమంగా మరుగున పడిపోతున్నాయి. నేస్తం పథకం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలు చేస్తే ఎంతో మేలు..
రెండేళ్లపాటు ఈ కార్యక్రమం బాగా అమలు జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థినులకు కష్టకాలంలో నిజంగా నేస్తంగా మారింది. నేస్తం పథకాన్ని మరలా విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పి.వి.వి.సత్యనారాయణరాజు, ప్రధానోపాధ్యాయులు, శ్రీనగర్, కాకినాడ
ఎంతోగానో ఉపయోగకరం..
అసౌకర్యంగా ఉండే రోజుల్లో విద్యార్థినులకు న్యాప్‌కిన్లు అందజేస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బడిలో ప్రశాంతంగా పాఠాలు వింటారు. నిధుల కొరత కారణంగా నిలిపివేసిన ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
ఎం.వెంకట్రావు,సర్వశిక్షా అభియాన్ సీఎంఓ