nestam
-
నేడు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ ప్రారంభం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అమలు చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా అర్హులైన కాపు మహిళలు 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ చేయనున్నారు. అర్హతే ప్రామాణికం దారిద్య్ర రేఖకు దిగవనుండటమే ప్రామాణికంగా వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేసింది. ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరినీ గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు. లబ్ధిదారుల పేర్లతో కూడిన జాబితాలను సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల తర్వాత తుది జాబితాలను శాశ్వత ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు. ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉండరాదు. ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు. -
దూరమైన ‘నేస్తం’
పంపిణీకు నోచుకోని న్యాప్కిన్లు ఆరంభశూరత్వంగా మిగిలిన పథకం బాలాజీచెరువు(కాకినాడ) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం 2012లో నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. రుతు సమయంలో కౌమర బాలికలకు న్యాప్కిన్లను ఉచితంగా అందించేవారు. 2012–13, 2013–14 విద్యాసంవత్సరంలో వీటిని పంపిణీచేశారు. ఆయా పాఠశాలల్లో ఉపా«ధ్యాయినులకు దీని నిర్వహణ బాధ్యత వహించేవారు. అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అనారోగ్యం బారిన పడుతున్న పేద విద్యార్థినులకు ఈ పథకం ఓ వరంగా ఉండేది. ప్రస్తుతం ఈ పథకం దూరమైంది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,7,8, తరగతులు చదువుతున్న విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాప్కిన్లు మంజూరు చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయినుల ఆధ్వర్యంలో అవసరమైన వారికి అందజేసేవారు. ఉచితంగా ఇవ్వడంతో పాటు, వాటి వినియోగంపై అవగాహన కల్పించేవారు. రెండేళ్ల పాటు మంచి ఫలితాలను ఇచ్చిన ఈ పథకం ప్రస్తుతం మూలన పడింది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు ఉపయోగపడేలా ఉన్న ఈ పథకాన్ని మరలా ప్రారంభించేలా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆరంభం శూరత్వమే... ప్రభుత్వ పథకాల లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నా ఆచరణలో చాలా వరకు విఫలమవుతుంటాయి. ఘనంగా ప్రారంభిస్తున్న పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో క్రమంగా మరుగున పడిపోతున్నాయి. నేస్తం పథకం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలు చేస్తే ఎంతో మేలు.. రెండేళ్లపాటు ఈ కార్యక్రమం బాగా అమలు జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థినులకు కష్టకాలంలో నిజంగా నేస్తంగా మారింది. నేస్తం పథకాన్ని మరలా విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పి.వి.వి.సత్యనారాయణరాజు, ప్రధానోపాధ్యాయులు, శ్రీనగర్, కాకినాడ ఎంతోగానో ఉపయోగకరం.. అసౌకర్యంగా ఉండే రోజుల్లో విద్యార్థినులకు న్యాప్కిన్లు అందజేస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బడిలో ప్రశాంతంగా పాఠాలు వింటారు. నిధుల కొరత కారణంగా నిలిపివేసిన ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎం.వెంకట్రావు,సర్వశిక్షా అభియాన్ సీఎంఓ