సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అమలు చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా అర్హులైన కాపు మహిళలు 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ చేయనున్నారు.
అర్హతే ప్రామాణికం
- దారిద్య్ర రేఖకు దిగవనుండటమే ప్రామాణికంగా వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేసింది. ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరినీ గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు.
- లబ్ధిదారుల పేర్లతో కూడిన జాబితాలను సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల తర్వాత తుది జాబితాలను శాశ్వత ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు.
- కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చు.
- పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.
- ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉండరాదు.
- ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు.
Comments
Please login to add a commentAdd a comment