ఏపీలో కొత్త రైల్వే లైన్లకు సహకరించండి | New train lines to develop in andhra pradesh state | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్త రైల్వే లైన్లకు సహకరించండి

Published Sat, Oct 31 2015 9:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

New train lines to develop in andhra pradesh state

- రైల్వే జీఎంను కోరిన ముఖ్యమంత్రి
సాక్షి, విజయవాడ బ్యూరో : ఏపీలో రోడ్డు కనెక్టివిటీకి సమాంతరంగా రైల్వే లైన్లను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, ఇందుకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పారిశ్రామిక అవసరాల కోసం ప్రస్తుత విశాఖ-చెన్నయ్ రైలు మార్గానికి అదనంగా డెడికేటెడ్ రైల్వే లైన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కొత్త జీఎంగా బాధ్యతలు స్వీకరించిన గుప్తా శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లైన్లను సత్వరం పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్లు, మూడు నోడ్లు, రెండు మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లు కొత్తగా ఏర్పాటవుతున్నాయని వాటి అవసరాలు తీర్చే విధంగా కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాల్సివుందన్నారు. అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలను హైదరాబాద్-బెంగుళూరు మార్గానికి అనుసంధానం చేస్తూ కొత్త రహదారి నిర్మాణం జరగనుందని ఇదే మార్గంలో రైల్వే లైను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

అవసరమైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, రుణాలు తీసుకోవడం ద్వారా కొత్త రైల్వే లైన్ల నిర్మాణాలు చేపడదామని సీఎం ప్రతిపాదించారు. రైల్వే వ్యవస్థలో బూజుపట్టిన విధానాలను సమూలంగా మార్చేయాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త లైన్లు వేయాలన్నా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా దశాబ్దాల కాలం పడుతోందని, ఈ విధానాలను మార్చే సరికొత్త డైనమిజం రైల్వే శాఖకు అవసరమని అన్నారు. విశాఖ-చెన్నయ్, గూడూరు-తిరుపతి మార్గాల్లో మూడో లైను ఏర్పాటు, అమరావతి నుంచి రాయలసీమ జిల్లాల మీదుగా బెంగుళూరుకు కొత్త మార్గం ఏర్పాటు తదతర అంశాలపై తగిన ప్రతిపాదనలతో మరో 20 రోజుల్లో సమావేశమై చర్చిద్దామని తెలిపారు.

రాజమహేంద్రవరంలో పురాతన హేవలాక్ బ్రిడ్జిని తక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. లేనిపక్షంలో రైల్వే శాఖే వేలంలో దీన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని అభ్యంతరం లేదన్నారు. ఈ బ్రిడ్జిని హెరిటేజ్ చిహ్నంగా భావిస్తున్నామని, దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, సహాయ కార్యదర్శి రాజమౌళి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement