సారిక సజీవ దహనం కేసులో మరో ట్విస్ట్
వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు సజీవ దహనం కేసులో మరో కొత్త కోణం బయటపడింది. రాజయ్య నివాసంలో ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. సారిక, పిల్లలు తిన్న అన్నంలో మత్తుమందు కలిపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్‌రూమ్‌కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది.
కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్‌రూమ్‌కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో వారు తిన్న ఆహారంలో ఎవరైనా మత్తుమందు కలిపారా? అందుకే గ్యాస్ లీక్ అయినా ఆ వాసనను కూడా గుర్తించలేకపోయారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు వారు తిన్న ఆహారాన్ని సేకరించి ...పరీక్షలకు పంపారు.
ఇక మాజీ ఎంపీ రాజయ్యతో పాటు ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్... మామూనూరు పోలీసులు అదుపులో ఉన్నారు. సారిక, ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాజయ్య కుటుంబసభ్యులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ నిమిత్తం హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి మామూనూరుకు తరలించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అనిల్ రెండో వివాహం చేసుకున్న సనా అనే మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా విచారణ నిమిత్తం మామునూరు పోలీస్ స్టేషన్ నుంచి వారిని మరోచోటుకు తరలించే అవకాశం ఉంది.