ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను పెద్దపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా బసంత్‌నగర్‌కు చెందిన కొందరు యువకులకు నైజీరియన్ ముఠా సభ్యులు అధిక డబ్బు ఆశ చూయించిమెసేజ్‌ల ద్వారా గాలం వేశారు.
కొంత మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తే.. అధిక మొత్తంలో తిరిగి ఇస్తామని నమ్మబలికారు. దీంతో పలువురు అమాయక యువకులు ముఠా సభ్యులు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమాచేశారు. ఎంతకి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. విసిగిపోయిన ఓ యువకుడు ఈ విషయంలో ఎస్పీ గారిని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియా ముఠాకు చెందిన ఏడుగురు యువకులను శుక్రవారం అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ. 6.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ముఠా సభ్యుల్లో ఇద్దరు గతంలో కూడా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించారని పోలీసులు తెలిపారు. పెద్దపల్లి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆడ్మిన్ ఎస్పీ అన్నపూర్ణ శుక్రవారం వివరాలు వెల్లడించారు.