మీరు చెబితే ప్రత్యేకహోదా తేవాలా?: చినరాజప్ప
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఉప ముఖ్యమంత్రి, హోం శాఖమంత్రి చినరాజప్పను విలేకరులు ప్రశ్నించగా.. మీరు చెబితే తేవాలా అంటూ అసహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే చేస్తానన్నారు. నేరస్తులు తాము చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీని వాడుతున్నారని, అదే టెక్నాలజీతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు పనిచేయాలని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
కష్టపడి పనిచేసిన ఏపీపీలకు ప్రమోషన్‌లు ఇచ్చి జడ్జీలను చేస్తామన్నారు. హోటల్ ఐలాపురంలో ‘ సైబర్ క్రైమ్స్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్’ అనే అంశంపై రాష్ట్రంలోని 13జిల్లాలకు చెందిన ఏపీపీలతో కృష్ణా జిల్లా డిప్యూటీ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు అధ్యక్షతన శనివారం ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ముఖ్యఅతిథి చినరాజప్ప మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక నేరాలతో పాటు మహిళలు, బాలలపై నేరాలు తీవ్రంగా పెరిగాయని, ఆర్థిక నేరాల వల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రజలకు అధిక వడ్డీ ఆశచూపించి ప్రైవేటు సంస్థలు వారి నుంచి డిపాజిట్‌ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తున్నాయన్నారు.
అలాంటి నేరాలపై ఏపీపీలు స్పందించి వారి ఆస్తులను కోర్టు ద్వారా జప్తుచేయించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మహిళల హక్కులను పరిరక్షించి వారి స్వేచ్ఛా జీవితానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఏపీపీలు నీతి, నిజాయితీ, జవాబుదారీతనంతో పనిచేయాలని, నేర నిరూపణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లదే కీలక పాత్ర అని అన్నారు. భారత, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తూ దర్యాప్తులోని లోపాలను చూసుకుని నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.