గతంలో నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో స్టెంట్ల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కార్డియాలజీ విభాగాధిపతి శేషగిరిరావుకు ఎట్టకేలకు క్లీన్ చిట్ లభించింది.
హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావుకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య పరికరాల డీలర్ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెండేళ్ల క్రితం శేషగిరిరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అవినీతి కేసులో అరెస్టు కావడంతో 2013 జనవరిలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత అదే ఏడాది సస్పెన్షన్ ఎత్తివేసింది. ఏసీబీ తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ శేషగిరిరావు ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో, సర్కారు విజిలెన్స్ కమిషనర్ విచారణకు సిఫారసు చేసింది. మరోవైపు శేషగిరిరావును ప్రాసిక్యూట్ చేయాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని శేషగిరిరావు అభ్యర్థన మేరకు విజిలెన్స్ కమిషనర్‌కు నివేదించింది. సమగ్ర దర్యాప్తు జరిపిన విజిలెన్స్ కమిషనర్ శేషగిరిరావుపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని తేల్చారు. లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువు కానందున ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో శేషగిరిరావును నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.