‘బయోమెట్రిక్’కు మంగళం!
► పనిచేయని సర్వర్లు
► మాన్యువల్‌గానే విద్యార్థుల హాజరు
► 94 ఎస్సీ హాస్టళ్లలో నిలిచిన సేవలు
► అక్రమాలకు చెక్ పెట్టేందుకు 2015లో అమలు
వీణవంక(హుజూరాబాద్): సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలను అరికట్టేందుకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం నీరుగారిపోతోంది. సర్వర్లు పనిచేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 94 ఎస్సీ హాస్టళ్ల విద్యార్థులు మాన్యువల్‌గానే హాజరవుతున్నారు. ఫలితంగా ఆర్భాటంగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రం పనిలేకుండా మూలకుపడింది.
ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులందరూ హాజరుకాకున్నా.. ఉన్నట్లు రికార్డులు సృష్టించి పథకాన్ని నీరుగార్చుతున్నారని గుర్తించిన ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని భావించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. బయోమెట్రిక్‌కు సంబంధించిన సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ విధానం మూలనపడింది. ఎప్పటిలాగే మళ్లీ పాత పద్ధతిలోనే మాన్యువల్‌గా విద్యార్థుల హాజరు శాతాన్ని చూపిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 94 హాస్టళ్లు
ఉమ్మడి కరీంనర్ జిల్లావ్యాప్తంగా 94 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 4850మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా ఉదయం 10 గంటలలోపు వేలుముద్ర వేయాలి. దానిని స్కాన్ చేసి హాజరుశాతాన్ని ఆన్‌లైన్ ద్వారా జిల్లా అధికారులకు పంపించాలి. అయితే సర్వర్లు పనిచేయకపోవడం.. సాంకేతిక సమస్యలతో బయోమెట్రిక్ మూలనపడింది.
బయోమెట్రిక్ విధానం ఇలా..
హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ల్యాప్‌టాప్, ఆన్‌లైన్ సౌకర్యం, వేలిముద్రల స్కానర్‌ను ప్రతి హాస్టల్‌కు 2015లో సమకూర్చింది. ప్రతినెలా ఆన్‌లైన్ బిల్లు రూ.1200 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యార్థుల వేలిముద్రలు ప్రతిరోజూ స్కానింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపించాలి. విద్యార్థుల గైర్హాజరు ఉన్నా.. హాజరుశాతం పెరిగినా.. ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది. తద్వారా ఎంత మంది హాస్టల్‌లో ఉంటున్నారని అధికారులు గుర్తించే వీలుంటుంది. దీంతో అక్రమాలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని ప్రభుత్వం భావించింది.
పని చేయని సర్వర్లు
విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా.. ఇంతవరకు బయోమెట్రిక్ సేవలు జిల్లావ్యాప్తంగా ప్రారంభం కాలేదు. ప్రతి హాస్టల్ నుంచి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు సర్వర్లను అనుసంధానం చేశారు. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇప్పటివరకు సేవలు ప్రారంభంకాలేదు. విద్యార్థుల వేలి ముద్రలు సక్రమంగా స్కానింగ్ చేయకపోవడం.. గ్రా మీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సమస్య తీవ్రంగా ఉండ డం ద్వారా గతేడాది అంతంత మాత్రంగానే కొనసాగించారు.
ఈ విద్యా సంవత్సరంలోనైనా పకడ్బందీగా అమల్లోకి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావించగా.. సర్వర్లు పని చేయకపోవడం వల్ల ఈ విధానం మూలనపడింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది హాజరు శాతాన్ని మాన్యువల్‌గానే కొనసాగిస్తున్నారు. బయోమెట్రిక్ లేకుంటే మళ్లీ అక్రమాలు జరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని త్వరగతిన బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.