ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది.
ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను సులభతరం చేసేలా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నైజేషన్, స్క్రీన్ లాక్ పిన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ తరుణంలో గూగుల్ అకౌంట్ యూజర్లు పాస్‌వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.
పాస్‌వర్డ్ 123లకు గుడ్‌బై
ప్రస్తుతం, ఏదైనా వెబ్‌సైట్, యాప్‌లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతో పాటు పాస్‌వర్డ్ 123, పాస్‌వర్డ్ 123@$ ఈ తరహాలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బయోమెట్రిక్ అథంటికేషన్ ఆధారిత ‘పాస్‌కీస్’ ఆప్షన్‌తో సంప్రదాయ పాస్‌వర్డ్‌లైన పాస్‌వర్డ్ 123లకు స్వస్తిపలకనుంది. వచ్చే ఏడాది వరల్డ్ పాస్‌వర్డ్‌డే నాటికి యూజర్లు వినియోగించేలా ఈ పాస్‌కీస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
పాస్‌కీస్ అంటే?
పాస్‌కీస్ అంటే ఫేస్‌ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం. దీని సాయంతో 123 తరహా పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. వెబ్ అథింటిక్ ఆధారిత ఫేస్‌ఐడీ లేదా టచ్ ఐడీలను ఉపయోగించి యాప్స్‌లో లేదంటే వెబ్‌సైట్‌లలో లాగిన్ అయ్యేలా సౌకర్యం కలగనుంది.
పాస్‌కీస్ టెక్నాలజీ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే
టెక్నాలజీ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అరికట్టేందుకు 2009లో పాస్‌కీస్ విధానం వినియోగిస్తే బాగుండేదన్న ఆలోచన వచ్చింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. అయితే 2012లో అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ పేపాల్ దిగ్గజ టెక్ కంపెనీలతో కలిసి పాస్‌వర్డ్‌ల స్థానంలో బయోమెట్రిక్ టెక్నాలజీ వినియోగం కోసం పనిచేసేలా ఓ ఒప్పందానికి వచ్చాయి.
ఫిడోలో గూగుల్ భాగస్వామ్యం
అలా జులై 2012లో ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్‌లైన్(Fast Identity Online (FIDO) పేరుతో ఓ సంస్థను స్థాపించాయి. 2013లో ఫిడోలో గూగుల్ సైతం చేరింది. ఆ మరుసటి ఏడాది అంటే 2014లో పేపాల్ - శాంసంగ్ కలిసి ఫిడో అభివృద్ది చేసిన అథంటికేషన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్‌లలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. దీని సాయంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్‌లలో పేపాల్ యూజర్లు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే పాస్‌వర్డ్ లేకుండా స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
గూగుల్ పాస్‌కీస్ ప్రయోగం
తాజాగా పాస్‌కీస్ ఫీచర్ తెచ్చేందుకు గూగుల్ ప్రయోగాలు ముమ్మరం చేసింది. ఫిడో అలయన్స్‌లో ఉన్న ఇతర టెక్ సంస్థలైన యాపిల్, మైక్రోసాఫ్ట్ పాస్‌కీస్ ప్రాజెక్ట్‌పై కలిసి పనిచేస్తుంది. ఆ ప్రాజెక్ట్ చివరి దశలో ఉందని , వచ్చే ఏడాది మే 2 వరల్డ్ పాస్‌వర్డ్ డే రోజున పాస్‌వర్డ్‌ల స్థానంలో పాస్‌కీస్ ఆప్షన్‌ను గూగుల్ తేనున్నట్ల నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: చిన్న చిన్న లావాదేవీల కోసం పిన్ అక‍్కర్లేదు!
Comments
Please login to add a commentAdd a comment