విశాఖకు ఈసారైనా వచ్చేనా ? | No decision yet on railway zone | Sakshi
Sakshi News home page

విశాఖకు ఈసారైనా వచ్చేనా ?

Published Wed, Feb 24 2016 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

విశాఖకు ఈసారైనా వచ్చేనా ?

విశాఖకు ఈసారైనా వచ్చేనా ?

రైల్వే జోన్‌పై సర్వత్రా ఉత్కంఠ
గత ఏడాది హామీలు అరకొరగా అమలు
బడ్జెట్‌లో వాల్తేరుకు ఏమిస్తారో?

 
విశాఖపట్నం : తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ అతిపెద్ద ఆదాయ వనరు. రైల్వే జోన్ మొత్తమ్మీద వచ్చే అదాయంలో సగానికి పైగా ఈ డివిజన్ నుంచే వస్తోంది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా ద్వారా వాల్తేరు డివిజన్‌కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. ఒక్క సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షలు తెస్తోంది. అయినా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్‌కు కేంద్రం నుంచి స్పందన లేదు. ఏళ్ల తరబడి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
 
రాష్ట్ర విభజన చట్టంలోనూ వాల్తేరు జోన్ ఏర్పాటు అంశాన్ని పేర్కొనడంతో 2015 రైల్వే బడ్జెట్‌లో ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదు. జోనే కాదు.. గత బడ్జెట్‌లో ప్రకటించిన డివిజన్ అభివృద్ధి పనులకు కూడా సహకరించడం లేదు. దీంతో వాల్తేరు డివిజన్ రైల్వేకి బంగారు బాతుగుడ్డులా ఆదాయం తెచ్చిపెట్టడానికే తప్ప జోన్ ఏర్పాటుకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు.
 
టీడీపీ మద్దతునిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, ఆ రెండు పార్టీల ఎంపీలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవలే కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కలిశాక జోన్ వచ్చేస్తోందంటూ కేంద్రంలోని టీడీపీ మంత్రులు తెగ హడావుడి చేశారు. గురువారం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లోనైనా జోన్ కల సాకారం చేస్తారా? మళ్లీ మొండి చేయే చూపిస్తారా? విశాఖకు ఎలాంటి వరాలు కురిపిస్తారోనన్న ఆసక్తి  ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.
 
ఎందుకీ వివక్ష...
విశాఖపట్నం డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా చేయడానికి అవసరమైన అన్ని అర్హతలున్నాయి. కానీ విశాఖ కంటే తక్కువ వనరులు, డివిజన్లున్న ఇతర రాష్ట్రాల్లో రైల్వే జోన్‌లు ఏర్పాటు చేసేశారు. పైగా ఏ కమిటీలు వేయకుండానే ఆయా రాష్ట్రాల్లో జోన్‌లు ఏర్పాటు కాగా, విశాఖ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు.

ఉదాహరణకు చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, బిలాస్‌పూర్ డివిజన్లు ఉన్నాయి. కానీ అక్కడ బిలాస్‌పూర్ డివిజన్ ఇచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లుండగా హైదరాబాద్ జోన్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలో హుబ్లి, మైసూర్, బెంగళూరు డివిజన్లుండగా హుబ్లి డివిజన్ ఇచ్చారు. ఒడిశాలో సంబల్‌పూర్, ఖుర్దా డివిజన్లకు భువనేశ్వర్‌లో జోన్ ఏర్పాటు చేశారు. కానీ విశాఖకు (విశాఖ, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ) నాలుగు డివిజన్లు ఉన్నా జోన్‌కు నోచుకోవడం లేదు.
 
అర్ధశతాబ్దంగా..
 విశాఖపట్నానికి జోన్ ఏర్పాటు డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం తొలిసారిగా పార్లమెంటులో జోన్ డిమాండ్‌ను లేవనెత్తారు. అప్పట్నుంచి జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా అవేమీ కేంద్రం చెవికెక్కడం లేదు. యూపీఏ ప్రభుత్వం 2013 మార్చిలో విశాఖకు రైల్వే జోన్‌పై ఓ కమిటీ వేసింది. ఆ నివేదికపై అతీగతీ లేదు. అంతేకాదు.. 2003కి ముందు దేశంలో 9 జోన్లుండేవి. అవి కాలక్రమంలో 17 జోన్లకు పెరిగాయి. కానీ వాటికేమీ కమిటీలు వేయలేదు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో అవి ఏర్పడిపోయాయి. కానీ విశాఖకు జోన్ విషయానికి వచ్చేసరికి ఏటేటా ఏవేవో కారణాలతో వాయిదాలు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 3, ముంబైలో రెండు జోన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జోన్ కూడా లేదు.
 
 
ఆదాయం ఘనం...అభివృద్ధి శూన్యం
తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు రూ.11 వేల కోట్లు. ఇందులో దాదాపు సగం అంటే రూ.6,500 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12-14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోర్టు ట్రస్టు, మరొక ప్రయివేటు పోర్టు, అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి ఇక్కడే ఉన్నాయి.
 
గత బడ్జెట్ హామీలదీ అదే దారి..
వడ్లపూడి వ్యాగన్ పీవోహెచ్ వర్క్‌షాపునకు రూ.213.71 కోట్లు కేటాయించారు. కానీ రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో సర్వే, డ్రాయింగ్ పనులు పూర్తి చేశారు.
 ట్రాక్‌ల నవీకరణకు రూ.299 కోట్లు కేటాయించినా నిధులు మంజూరు కాలేదు.
 వాల్తేరు డివిజన్‌లో అభివృద్ధి పనులకు రూ.695 కోట్లు ప్రకటించారు.
 కానీ అరకొర నిధులతో డీజిల్ షెడ్లు, ప్లాట్‌ఫారం అభివృద్ధి వంటి కొద్దిపాటి పనులు జరుగుతున్నాయి.
 రైల్వే స్టేషన్‌లో వైఫై సదుపాయం కల్పిస్తామని ప్రకటించినా నేటికీ అమలు కాలేదు.
 రైళ్ల ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఆధునికీకరణ పనులకు రూ.17.78 కోట్లు
 335 కిలోమీటర్ల దువ్వాడ-విజయవాడ కొత్త సర్వే లైన్‌కు 3.34 కోట్లు, దువ్వాడ-విజయవాడ లైను కొత్త పనులకు రూ.76.60 కోట్లు గత బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ వాటికీ అరకొర నిధులే విడుదల చేశారు.
 
ప్రధాన డిమాండ్లు/ప్రతిపాదనల్లో కొన్ని..
 విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ఏర్పాటు చేయాలి.
 విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రికి ఈఎంయూ రైళ్లు న డపాలి.
 కొత్త రాజధాని నేపథ్యంలో విశాఖపట్నం-విజయవాడకు పగలు, రాత్రి మరో నాలుగు రైళ్లు నడపాలి.
 విశాఖ వచ్చే రైళ్లు ఔటర్‌లోనే నిలిచిపోతున్నందున మరో రెండు ట్రాక్‌లు నిర్మించాలి.
 తిరుపతికి రోజూ మరిన్ని రైళ్లు నడపాలి.  
 రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను పెంచాలి.
 విశాఖలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.  
 విశాఖ-హైదరాబాద్ దురంతో వారానికి మూడుసార్లకు బదులు రోజూ నడపాలి
 విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే రైళ్ల సమయం తగ్గించాలి.
 విశాఖ-తిరుపతి మధ్య గరీబ్థ్,్ర విశాఖ-వారణాశి మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలి.
 అయ్యప్ప భక్తుల కోసం విశాఖ నుంచి కేరళకు ఎక్స్‌ప్రెస్ వేయాలి.
 విశాఖ-బెంగళూరు, విశాఖ-తిరుపతి, విశాఖ షిర్డీలకు డైలీ రైళ్లు నడపాలి.
 గోపాలపట్నం-విశాఖ స్టేషన్ల మధ్య మూడో లైన్ వేస్తే స్టేషనుకు వచ్చే ప్రయాణికుల నిరీక్షణ తప్పుతుంది.
 విశాఖ కేంద్రంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)ను ఏర్పాటు చేయాలి.
 విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయమే ఢిల్లీ చేరేలా వేళలు మార్చాలి.
 
 ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే..
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పట్టించుకోకపోవడం వల్లే విశాఖపట్నానికి ప్రత్యేక జోన్ రావడం లేదు. రైల్వే సమస్యలపై వారికి అవగాహనే కాదు.. చిత్తశుద్ధి కూడా లేదు. సీఎం చంద్రబాబు జోన్ కోసం గట్టిగా మాట్లాడడం లేదు. చాన్నాళ్లుగా జోన్ కోసం ఉద్యమిస్తున్నా ఇటీవల ఐఎఫ్‌ఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చినప్పుడు గాని, అంతకుముందు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన కేంద్రమంత్రులతో గాని సీఎం, మంత్రులు, ఎంపీలు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు.
 
ప్రతిసారీ కేంద్ర ైరె ల్వే బడ్జెట్ సమయంలో ఒడిశా రాష్ట్రం అడ్డుపడుతోందంటూ తప్పించుకుంటున్నారు. వచ్చే రైల్వే బడ్జెట్‌లో విశాఖకు రైల్వే జోన్‌తో పాటు విశాఖ-విజయవాడల మధ్య ఉదయం, రాత్రి వేళల్లో అదనంగా రెండేసి రైళ్లు నడపాలి. కొత్తరాజధానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగనున్నందున ఈ నిర్ణయం తీసుకోవాలి. శతాబ్ది, డబుల్ డెక్కర్ రైళ్లను విశాఖ-విజయవాడల మధ్య నడపాలి. విశాఖ నుంచి రాజమండ్రి, పలాసలకు కొత్తగా ఈఎంయూలు వేస్తే అక్కడ నుంచి వచ్చే కూరగాయలు, పండ్లు, ఇతర సరకులు చౌకగా విశాఖవాసులకు అందుతాయి. గత బడ్జెట్‌లో పేర్కొన్న వ్యాగన్ వర్క్‌షాపుకు నిధులు విడుదల చేయక అడుగు ముందుకు పడలేదు.
 -చలసాని గాంధీ, ప్రధాన కార్యదర్శి, ఈకో రైల్వే శ్రామిక్ యూనియన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement