సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా.. అధికారంలోకి వచ్చాకైనా తన విధానం ఒకటేనని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాటి చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు పరమావధి అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేశారు.
అధికారంలోకి వచ్చాక ఢిల్లీ వెళ్లినప్పుడల్లా.. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా కల్పించాలని.. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలనే తదితర అంశాల గురించి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపటి విశాఖ పర్యటనలో ఆయా అంశాల గురించి మరోసారి విజ్ఞప్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.
ప్రత్యేక హోదాపై ఒకే మాట..
విభజన నేపథ్యంలో ఐదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారు. పార్లమెంటు ద్వారా హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలుస్తుందని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అప్పట్లో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కానీ.. నాటి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. దాంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగిస్తూ.. ప్రత్యేక హోదా స్థానంలో ఆర్థిక సహాయాన్ని 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్రం ప్రకటించింది.
ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన సహాయంతోనే రాష్ట్రానికి అధికంగా ప్రయోజనం కలుగుతుందని అప్పట్లో సీఎంగా చంద్రబాబు ప్రశంసించారు. శాసనసభలో ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఆర్థిక సహాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరదని.. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం రూపురేఖలు మారుతాయని ప్రజలకు వివరిస్తూ వైఎస్ జగన్ ఉద్యమించారు.
తద్వారా ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయం సాధించాక.. సీఎం హోదాలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన తొలిసారే ప్రత్యేక హోదాపై తన విధానాన్ని కుండబద్ధలు కొట్టారు. కేంద్రంలో పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా లేదా రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా కల్పించాలని వి/æ్ఞప్తి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అదే బాటలో పయనిస్తున్నారు.
ప్రణాళికాయుతంగా పోలవరం
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సీఎంగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేశారు. ప్రణాళికా రాహిత్యంతో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పనులు చేపట్టడం వల్ల అస్తవ్యస్తంగా మారిన పోలవరాన్ని గాడిలో పెట్టి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇచ్చి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహరించాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు ఇచ్చి పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహరించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీకి ఇదే అంశాన్ని మరోసారి గుర్తు చేసి.. పోలవరంను సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరనున్నారు.
విశాఖ ఉక్కుపై ఉడుం పట్టు
విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రభుత్వ రంగంలోనే లాభాల బాటలో విశాఖ ఉక్కు పరిశ్రమను నడిపించేందుకు ఉక్కు గనులను కేటాయించడం.. రుణాలను పునర్ వ్యవస్థీకరించడం.. మిగులుగా ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని ప్లాటింగ్ చేసి అమ్మడం.. రెండేళ్ల గడువు ఇవ్వడం తదితర ప్రత్యామ్నాయ మార్గాలను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ సూచించారు.
విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ సంఘీభావం ప్రకటించింది. అటు రాజ్యసభలో.. ఇటు లోక్‌సభలో కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ పోరాటం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ 120 మంది ఎంపీల సంతకాలను సేకరించి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రాన్ని సమర్పించింది.
ఈ వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు టీడీపీ ఎంపీలు నిరాకరించడం ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా తమది రెండు నాల్కల ధోరణే అని చాటి చెప్పారు. విశాఖపట్నంకు వస్తున్న ప్రధాని మోదీకి మరోసారి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నడపాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment