
మూన్నాళ్ల ముచ్చటే..
► నెరవేరని సీఎం హామీలు
► వీఐపీల విమానాలకే ఎయిర్‌పోర్టు
► ఇక్కడి నుంచి సాగని రాకపోకలు
► ప్రతిసారి రద్దవుతున్న విమానాలు
► పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు
కడప ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్నాం.. ఇక్కడి నుంచి తొలుత బెంగళూరుకు ఎయిర్ పెగాసిస్ సంస్థ విమాన సర్వీసులు వారంలో మూడుసార్లు తిరుగుతాయి...భవిష్యత్తులో ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు విమానాలు నడిచేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.అవసరమైన సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తాం..ఇవి 2016లో సీఎం చంద్రబాబు అన్న మాటలు.. అయితే నేటికీ ఇవేవి నెరవేరలేదు.
సాక్షి, కడప: ఎంతో చరిత్ర కలిగిన కడప విమానాశ్రయం బోసిపోతోంది. దీనిని బ్రిటీషు వారి హయాంలో నెలకొల్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. అద్భుతంగా తీర్చిదిద్దినా కడప నుంచి విమానాల రాకపోకలు లేకపోవడంతోనే కళా విహీనంగా మారుతోంది. ప్రస్తుతం వీఐపీలు, వీవీఐపీల రాకపోకలకు సంబంధించిన విమాన సర్వీసులు మాత్రమే అప్పుడప్పుడు అలా కనిపించి వెళ్లిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కీలక నేతల ప్రయాణాల నేపథ్యంలో ప్రత్యేక విమానాలు ఆగేం దుకు.. గాలిలోకి ఎగిరేందుకు ఉపయోగపడిందనే చర్చ సాగుతోంది.ఈ క్రమంలో విమానాశ్రయం భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
అధికారులు చర్యలు తీసుకోవాలి: కడప విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ఎప్పుడు చూసినా మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. 2016 లో తొలుత కడప-బెంగళూరు సర్వీసును ప్రారంభించగా, కొద్దిరోజులకే ప్రయాణికులు లేరన్న సాకుతో రద్దు చేశారు.అనంతరం కడప-విజయవాడ, కడప-హైదరాబాదు సర్వీసులను ప్రారంభించినా అవి కూడా కొద్దిరోజులే కొనసాగాయి. తర్వాత కారణమేదైనా ఒక్కొక్క సర్వీసును రద్దు చేస్తుండడం కడప ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. విమాన రాకపోకలకు సంబంధించి ఎక్కువ ప్రచారం చేసి ఉంటే ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాదుకు ప్రయాణికుల రద్దీ బాగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కడప నుంచి విమానాలు మళ్లీ ఎప్పుడు తిరుగుతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం కొన్ని సర్వీసులైనా తిరిగేలా చూడాలని, ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు నడపండి
కడప కార్పొరేషన్: కడప విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయిలో సర్వీసులు నడపాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర విమానయానశాఖామంత్రి అశోక్ గజపతిరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 1953 నుంచి కడపలో ఎయిర్‌పోర్టు ఉన్నా దీనిని గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.33కోట్లు మంజూరు చేసి టెర్మినల్ బిల్డింగ్, 6000 అడుగుల రన్ వే నిర్మించారన్నారు. 2012 నాటికి డిపార్ట్‌మెంటల్ వర్క్స్ పూర్తయ్యాయని తెలిపారు. గత ఏడాది కడప ఎయిర్‌పోర్టును ప్రారంభించడంతో జిల్లా ప్రజలు ఎంతో సంతోషించారన్నారు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదని, కొంత కాలానికే కడప ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసులన్నీ ఆగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లాంటి వీవీఐపీలకే ఇది ఉపయోగపడుతోందన్నారు. రాయలసీమ జిల్లాలకు మధ్యలో ఉన్న కడప నుంచి చెన్నై, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ పట్నంలకు విమాన సర్వీసులు నడిపితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకొని రాయలసీమ జిల్లాల ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు.