పిల్లలకూ 'పెద్ద టికెట్'
రైలులో బెర్త్, సీట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే
అరటికెట్ ఉండదు
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి
తాడేపల్లిగూడెం : మురళీ, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక పిల్లకు నాలుగన్నరేళ్లు.. రెండో పాపకు 11 ఏళ్లు.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో వారంతా రైలులో దూర ప్రయాణం చేయాలనుకున్నారు. వెళ్లాలనుకునే ప్రాంతానికి ముందుగానే రైలు టికెట్ రిజర్వు చేసుకున్నారు. మురళీ, లక్ష్మిలకు ఫుల్ టికెట్ చార్జీలు, పెద్ద పిల్లకు హాఫ్ టికెట్, చిన్న పిల్లకు టికెట్ లేదు. రైల్వే నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు వయస్సుకలిగిన వారికి టికెట్ తీయనక్కరలేదు. ఐదు నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న వారికి అరటికెట్ తీయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి ఇక ఇలా కుదరదు.
వేసవి సెలవుల్లో ఇదే వయసున్న పిల్లలతో రైలు ప్రయాణం చేయాలంటే మరికొంత అదనపు భారం తప్పదు. ప్రయాణంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లకు ఎలాగు టికెట్ తీయనక్కరలేదు కాని, ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు బెర్‌త లేదా సీటు కావాలంటే పూర్తి టికెట్ తీయాల్సిందే. రెండు రోజుల క్రితం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
బెర్త్ కాని, సీటు కాని కన్‌ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్టులో ఉంటే మాత్రం అరటికెట్ తీసే అర్హత ఉన్న పిల్లలకు మామూలుగానే హాఫ్ టికెట్ తీసుకోవచ్చు. స్మార్ట్ ప్రయాణం. స్మార్ట్ టికెట్, వెయిటింగ్ లిస్టులో ఉన్నా డోంట్ వర్రీ అంటూ రైల్వే ఓ పక్కరాయితీలు ప్రకటిస్తూనే, మరో పక్క నొప్పి తెలియకుండా చార్జీల మోత మోగిస్తోంది.
టికెట్ల క్యాన్సిలేషన్‌కు ప్రత్యేక కౌంటర్లు
టికెట్ల రద్దుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈ నెల ఒకటిన రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. టికెట్ రద్దు చేసుకొని తిరిగి నగదు పొందేందుకు స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్, పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అంటూ రెండు రకాల కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. స్టార్ట్‌గా రైల్వే టికెట్ తీసుకొనేందుకు స్టేషన్లలో ఇప్పటికే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. రైలు ఎక్కే స్టేషన్ నుంచి గమ్యస్థానం 150 కిలో మీటర్ల లోపు ఉండే స్టేషన్లకే ఈ మెషీన్లలో టికెట్లు వస్తాయి.
టికెట్ రద్దు భారమే
రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 60 శాతం సొమ్ము మాత్రమే తిరిగి వస్తుంది. రైలు బయలుదేరిపోయాక టికెట్ రద్దుచేసుకోవాలంటే ఒక్క పైసా కూడా చేతికి రాదు. స్వచ్చభారత్ సెస్ పేరుతో మొదటి, రెండో తరగతి ఏసీ ప్రయాణీకుల నుంచి టికెట్ ధరలో అర శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలంటే తత్కాల్ చార్జీలు చెల్లించాలనే నిబంధన అమలులోకి వచ్చింది.
వెయిటింగ్ లిస్టా డోంట్ వర్రీ
వెయిటింగ్ లిస్టా డోంట్ వర్రీ అంటోంది రైల్వే శాఖ. వెయిటింగ్ లిస్టులో 200 టికెట్లు ఉంటే అదనపు బెర్తుల కోసం అవకాశం మేరకు కోచ్‌లు పెంచటం, అది సాధ్యంకాని పరిస్థితి అయితే వేరే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల ఇష్టం మేరకు వాటిలో బెర్‌తలు కేటాయించనున్నారు.