railway dept
-
భక్తులకు ‘రైల్వే’ ప్రత్యేక సౌకర్యాలు
గుంటూరు (నగరంపాలెం) : పుష్కర భక్తుల కోసం రైల్వే అధికారులు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. డివిజన్ పరిధిలోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడు, గుంటూరు, మంగళగిరి, రేపల్లె, కృష్ణా కెనాల్‌లోని రైల్వే స్టేషన్లలో హెల్ప్ సెంటర్లతో పాటు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో 1వ నంబరు ప్లాట్‌ఫాంపై హెల్ప్ సెంటరు, ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు ఈస్ట్ సైడు ఆర్టీసీ సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, అదనపు వాటర్ ట్యాప్‌లు, రెస్ట్ రూంలు, క్యాటరింగ్ స్టాల్స్, తాత్కాలిక బుకింగ్ కౌంటర్లు కూడా ఆయా స్టేషన్లలో ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకల వివరాలతో హోర్డింగ్‌లు పెట్టారు. తొలిసారి అన్ రిజర్వుడు టిక్కెట్ల జారీకి రెండు కౌంటర్లు ఉన్న వాహనాన్ని ఘాట్ల వద్ద, పుష్కరనగర్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఈస్ట్, వెస్ట్ సైడు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెదకూరపాడు, గుంటూరు రైల్వే స్టేషన్ నుంచే అమరావతికి నేరుగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. రెండు రోజులుగా పెరుగుతున్న రద్దీ.. పుష్కరాలకు రైళ్ళలో రెండు రోజులుగా రద్దీ కొనసాగుతోంది. వరుసుగా సెలవు దినాలు రావటంతో రెగ్యులర్ వాటితోపాటు ప్రత్యేక రైళ్ళలో 60శాతం పైనే ఆక్యుపెన్సీ ఉంది. సికింద్రాబాద్‌కు వైపు వెళ్లే ప్యాసింజరు రైళ్ళలో రద్దీ కొనసాగుతోంది. పుష్కర భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను డివిజన్ అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక బృందం, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఆలీఖాన్ ఆధ్వర్యంలో మరో బృందం రోజుకో మార్గంలో పర్యటించి సౌకర్యాలను స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలిస్తున్నారు. -
పలు రైళ్లకు అదనపు బోగీలు
పుష్కరాల దృష్ట్యా ఏర్పాట్లు గుంటూరు (నగరంపాలెం): పుష్కరాల దృష్ట్యా గుంటూరు డివిజను మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు రైల్వే డివిజను అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఎండీ ఆలీఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12705/12706గుంటూరు– సికింద్రాబాద్– గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, 17221/17222 కాకినాడ– లోక్‌మాన్యతిలక్ టెర్మినల్స్–కాకినాడ ఎక్స్‌ప్రెస్, 17211/17212 మచిలీపట్నం–యశ్వంత్‌పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్, 57327/57328 గుంటూరు– డోన్– గుంటూరు ప్యాసింజర్ రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా రెండు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57317/57324 గుంటూరు– మాచర్ల– గుంటూరు ప్యాసింజరు, 57381/57382 గుంటూరు– నర్సాపూర్–గుంటూరు ప్యాసింజరు రైళ్లకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా మూడు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 17225/17226 విజయవాడ– హుబ్లీ– విజయవాడ ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 10 నుంచి 25 తేదీ వరకు అదనంగా నాలుగు జనరల్ బోగీలు ఏర్పాటు చేయనున్నారు. 57620/57619 కాచిగూడ– రేపల్లె– కాచిగూడ ప్యాసింజర్ రైలుకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకు అదనంగా ఒక జనరల్ బోగీని ఏర్పాటు చేయనున్నారు. 08405/08406 పూరీ– గుంటూరు– పూరీ ప్రత్యేక రైలుకు ఆగస్టు 11,12,16,17,19,20,22,23 తేదీల్లో రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఒక ఏసీ త్రీటైర్‌కోచ్, రెండు స్లీపర్ కోచ్‌లు, 12705/12706 సికింద్రాబాద్– గుంటూరు– సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు 9వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 12747/12748 గుంటూరు– వికారాబాద్– గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, 12796/12795 సికింద్రాబాద్–విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నాలుగు సెకండ్ సీటింగ్ కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. 08507/08508 గుంటూరు–విశాఖపట్నం–గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌కు ఆగస్టు 11 నుంచి 23వ తేదీ వరకు రెండు స్లీపర్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దసరా సెలవుల రద్దీకి.. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం– తిరుపతి– విశాఖపట్నంకు న్యూగుంటూరు రైల్వేస్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 82851 విశాఖపట్నం – తిరుపతి ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3,10,17,24,31, నవంబరు 7,14 తేదీలు, 82852 తిరుపతి– విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4,11,18,25, నవంబరు 1,8,15 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లలో ఒక ఏసీ టూటైర్, మూడు ఏసీ త్రీటైర్, తొమ్మిది స్లీపర్ కోచ్‌లు, ఆరు జనరల్ బోగీలు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. -
పిల్లలకూ 'పెద్ద టికెట్'
రైలులో బెర్త్, సీట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే అరటికెట్ ఉండదు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి తాడేపల్లిగూడెం : మురళీ, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక పిల్లకు నాలుగన్నరేళ్లు.. రెండో పాపకు 11 ఏళ్లు.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో వారంతా రైలులో దూర ప్రయాణం చేయాలనుకున్నారు. వెళ్లాలనుకునే ప్రాంతానికి ముందుగానే రైలు టికెట్ రిజర్వు చేసుకున్నారు. మురళీ, లక్ష్మిలకు ఫుల్ టికెట్ చార్జీలు, పెద్ద పిల్లకు హాఫ్ టికెట్, చిన్న పిల్లకు టికెట్ లేదు. రైల్వే నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు వయస్సుకలిగిన వారికి టికెట్ తీయనక్కరలేదు. ఐదు నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న వారికి అరటికెట్ తీయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి ఇక ఇలా కుదరదు. వేసవి సెలవుల్లో ఇదే వయసున్న పిల్లలతో రైలు ప్రయాణం చేయాలంటే మరికొంత అదనపు భారం తప్పదు. ప్రయాణంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లకు ఎలాగు టికెట్ తీయనక్కరలేదు కాని, ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు బెర్త లేదా సీటు కావాలంటే పూర్తి టికెట్ తీయాల్సిందే. రెండు రోజుల క్రితం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బెర్త్ కాని, సీటు కాని కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్టులో ఉంటే మాత్రం అరటికెట్ తీసే అర్హత ఉన్న పిల్లలకు మామూలుగానే హాఫ్ టికెట్ తీసుకోవచ్చు. స్మార్ట్ ప్రయాణం. స్మార్ట్ టికెట్, వెయిటింగ్ లిస్టులో ఉన్నా డోంట్ వర్రీ అంటూ రైల్వే ఓ పక్కరాయితీలు ప్రకటిస్తూనే, మరో పక్క నొప్పి తెలియకుండా చార్జీల మోత మోగిస్తోంది. టికెట్ల క్యాన్సిలేషన్‌కు ప్రత్యేక కౌంటర్లు టికెట్ల రద్దుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈ నెల ఒకటిన రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. టికెట్ రద్దు చేసుకొని తిరిగి నగదు పొందేందుకు స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్, పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అంటూ రెండు రకాల కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. స్టార్ట్‌గా రైల్వే టికెట్ తీసుకొనేందుకు స్టేషన్లలో ఇప్పటికే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. రైలు ఎక్కే స్టేషన్ నుంచి గమ్యస్థానం 150 కిలో మీటర్ల లోపు ఉండే స్టేషన్లకే ఈ మెషీన్లలో టికెట్లు వస్తాయి. టికెట్ రద్దు భారమే రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 60 శాతం సొమ్ము మాత్రమే తిరిగి వస్తుంది. రైలు బయలుదేరిపోయాక టికెట్ రద్దుచేసుకోవాలంటే ఒక్క పైసా కూడా చేతికి రాదు. స్వచ్చభారత్ సెస్ పేరుతో మొదటి, రెండో తరగతి ఏసీ ప్రయాణీకుల నుంచి టికెట్ ధరలో అర శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలంటే తత్కాల్ చార్జీలు చెల్లించాలనే నిబంధన అమలులోకి వచ్చింది. వెయిటింగ్ లిస్టా డోంట్ వర్రీ వెయిటింగ్ లిస్టా డోంట్ వర్రీ అంటోంది రైల్వే శాఖ. వెయిటింగ్ లిస్టులో 200 టికెట్లు ఉంటే అదనపు బెర్తుల కోసం అవకాశం మేరకు కోచ్‌లు పెంచటం, అది సాధ్యంకాని పరిస్థితి అయితే వేరే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల ఇష్టం మేరకు వాటిలో బెర్తలు కేటాయించనున్నారు.