భక్తులకు ‘రైల్వే’ ప్రత్యేక సౌకర్యాలు
భక్తులకు ‘రైల్వే’ ప్రత్యేక సౌకర్యాలు
Published Mon, Aug 15 2016 6:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
గుంటూరు (నగరంపాలెం) : పుష్కర భక్తుల కోసం రైల్వే అధికారులు రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. డివిజన్ పరిధిలోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడు, గుంటూరు, మంగళగిరి, రేపల్లె, కృష్ణా కెనాల్‌లోని రైల్వే స్టేషన్‌లలో హెల్ప్ సెంటర్లతో పాటు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో 1వ నంబరు ప్లాట్‌ఫాంపై హెల్ప్ సెంటరు, ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు ఈస్ట్ సైడు ఆర్టీసీ సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే, అదనపు వాటర్ ట్యాప్‌లు, రెస్ట్ రూంలు, క్యాటరింగ్ స్టాల్స్, తాత్కాలిక బుకింగ్ కౌంటర్లు కూడా ఆయా స్టేషన్‌లలో ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకల వివరాలతో హోర్డింగ్‌లు పెట్టారు. తొలిసారి అన్ రిజర్వుడు టిక్కెట్ల జారీకి రెండు కౌంటర్లు ఉన్న వాహనాన్ని ఘాట్ల వద్ద, పుష్కరనగర్‌ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. అర్బన్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఈస్ట్, వెస్ట్ సైడు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెదకూరపాడు, గుంటూరు రైల్వే స్టేషన్ నుంచే అమరావతికి నేరుగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.
రెండు రోజులుగా పెరుగుతున్న రద్దీ..
పుష్కరాలకు రైళ్ళలో రెండు రోజులుగా రద్దీ కొనసాగుతోంది. వరుసుగా సెలవు దినాలు రావటంతో రెగ్యులర్ వాటితోపాటు ప్రత్యేక రైళ్ళలో 60శాతం పైనే ఆక్యుపెన్సీ ఉంది. సికింద్రాబాద్‌కు వైపు వెళ్లే ప్యాసింజరు రైళ్ళలో రద్దీ కొనసాగుతోంది. పుష్కర భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను డివిజన్ అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక బృందం, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు ఆలీఖాన్ ఆధ్వర్యంలో మరో బృందం రోజుకో మార్గంలో పర్యటించి సౌకర్యాలను స్వయంగా పరిశీలించి సిబ్బందికి సూచనలిస్తున్నారు.
Advertisement
Advertisement