కష్టాల్లో 104 ఉద్యోగులు | no pay the salarys for 104 employes | Sakshi
Sakshi News home page

కష్టాల్లో 104 ఉద్యోగులు

Published Mon, Aug 1 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

కష్టాల్లో 104 ఉద్యోగులు

కష్టాల్లో 104 ఉద్యోగులు

  • నాలుగు నెలలుగా అందని వేతనాలు
  • వేధిస్తున్న మందుల కొరత
  • మూలన పడిన రెండు వాహనాలు 
  • కరీంనగర్‌ హెల్త్‌ : పిలవకుండానే నేనున్నానంటూ ఇంటిముందు వాలి గ్రామీణ ప్రజలకు వైద్యసేవలందించే 104 వాహనం ఉద్యోగులకు కష్టాలు వచ్చిపడ్డాయి. నాలుగు నెలలుగా వేతనాలు, 20 నెలలుగా రోజువారి అలవెన్సులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్పులు చేసి రోజులు  గడుపుతున్నారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం వేతనాలు కూడా సక్రమంగా విడుదల చేయడం లేదని 104 సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
     
    గ్రామీణ, మారుమూల ప్రాంతాల పేదలకు వైద్యం అందించాలని దివంగత నేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 104 వాహనాన్ని 2008లో ప్రవేశపెట్టారు. హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థ పర్యవేక్షణ బాధ్యత చూసేది. రెండేళ్లుగా డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో నడుస్తున్నాయి. 104 సిబ్బంది రక్తపోటు, మధుమేహం, అస్తమా, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మందులు పంపిణీచేస్తారు. అవసరమైన∙వారికి అక్కడే రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 22 104 వాహనాలు ఉండగా.. 130 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్, సెక్యురిటీ గార్డు, ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డాటాఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. సెక్యూరిటీ గార్డుకు రూ.6500, డ్రైవర్‌కు 8,500, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు 9,500, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషయన్‌కు రూ.10,900 ఇస్తున్నారు. వీరికి రోజు ఖర్చుల కోసం రూ.70 డీఏ చెల్లించాలి. 20 నెలలుగా డీఏ రాకపోవడంతో చేతిఖర్చులకు డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.
     
    రెండు వాహనాలు మూలకు..
    జగిత్యాల, కోరుట్లలో 104 వాహనాలు సరైన నిర్వహణ లేక మూలనపడ్డాయి. రెండునెలలుగా జగిత్యాల వాహనం, 15 రోజులుగా కోరుట్ల వాహనం పేదల వైద్య సేవలకు దూరమయ్యాయి. ప్రభుత్వం వీటì నిర్వహణకు బడ్జెట్‌ కేటాయించకపోవడంతో రిపేర్‌ చేయించడం లేదు.  2008 నుంచి సేవలు అందిస్తున్న వాహనాలు దాదాపు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంజిన్‌ డౌన్‌ అయిపోయి టైర్లు అరిగిపోయాయి. వీటిస్థానంలో కొత్తవి ఏర్పాటుచేయాల్సిన అవసరముంది. 
     
    సరిపడని మందులు..
    ప్రజలకు అవసరమైన, సరిపడా మందులను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడంలేదు. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, పిల్లలకు ఇచ్చే ఐరన్, కాల్షియం మందులు వాహనంలో అందుబాటులోలేవు. దీంతో ప్రజలు 104సేవలను వినియోగించుకుని ఆసక్తి చూపడంలేదు. చెడిపోయిన వాహనాలు గ్రామంలోకి రాకపోవడంతో వైద్య సేవలు అందడంలేదు. అవసరమైన అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
     
    అన్నీ ఉంటే పీహెచ్‌సీకంటే నయం
    –ఖలీం, ఫార్మసిస్టు
    104లో అన్ని ఉంటే ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కంటే మంచిసేవలు అందించవచ్చు. గ్రామాల్లో అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రోగులకు వచ్చిన వ్యాధి గురించి వివరించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నాం.
     
    వేతనాలు చెల్లించాలి..
    –రావుల దేవదాస్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌
    ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలి. నాలుగు నెలలుగా వేతనాలు, 20 నెలలుగా డీఎ ఇవ్వకపోవడంతో ఇల్లు గడవం కష్టంగా మారుతోంది. వేతనాలు రాకపోవడంతో పిల్లలకు ఫీజులు చెల్లించలేకపోతున్నాం. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాము. 
     
    రెగ్యులరైజ్‌ చేయాలి
    –యాశ్వాడ ప్రకాశ్, 104 యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు
    104 సిబ్బందిని ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలి. అధికారంలోకి వచ్చే ముందు కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రెండేళ్లుగా  ప్రభుత్వానికి పలుసార్లు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. 104 వాహనాలు పెంచి సేవలు మరింత బలోపేతం చేయాలి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement