పంట ఎండే.. గుండె మండే
-
వర్షాలు లేక ఎండుతున్న పంట పొలాలు
-
21 రోజులుగా జాడ లేని వాన చినుకులు
-
ఆందోళనలో రైతులు
వాన చినుకుల జాడ లేదు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి సూర్యుడి ప్రతాపానికి ఆవిరైపోతోంది. ఎండలు మండుతున్నాయి. పంటలు ఎండుతున్నాయి. పైరు ప్రాణాలను కోల్పోతుంటే చూస్తూ ఏమీ చేయలే యలేని తన నిస్సాహాయత కారణంగా రైతు గుండె మండుతోంది. కంట కన్నీరు వర్షిస్తోంది. కానీ కఠిన హృదయం కలిగిన వరుణ దేవుడి మాత్రం కరగడం లేదు. రైతు హృదయ వేదనను తీర్చడం లేదు.
తలమడుగు : దాదాపు నెల రోజుల నుంచి వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాభావంతో పంటలు ఎండుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు రామన్న ఎండిపోతున్న పంటను చూసి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక వైపు వర్షం జాడ లేకపోవడం. మరోవైపు సాగునీటి వనరుల కొరత. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతు కూరుకుపోతున్నాడు. వర్షాలు లేక ఎండిపోతోంది.
పత్తి, కంది, జోన్న తాలుపోతోంది. కాపుకొచ్చిన సోయా పంట కళ్ల ఎదుట ఎండిపోతుంది. ఇలా రైతన్న ఆశలు ఒక్కొక్కటి ఆవిరి అవుతున్నాయి. జున్, జూలైలో మురిపించిన వరుణుడు చివరికి ముంచేసేలా ఉన్నాడని దిగులు చెందుతున్నారు.
వేల హెక్టార్లలో ఎండుతున్న పంటలు
మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో అధికంగా పత్తి, సోయా, కంది, జోన్న, పెసర, మినుము పంటలను సాగు చేస్తున్నారు. తలమడుగు మండలంలో మొత్తం 14 వేల హెక్టార్లలో పంటలను సాగు చేస్తున్నారు. తాంసి మండలంలో మొత్తం 16వేల హెక్టార్లలో పంటలను సాగుచేస్తున్నారు. బరుకం భూమి, అడుగులేని భూముల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఒక్కో ఎకరానికి ఇప్పటి వరకు 40 వేల పెట్టుబడిని పెట్టారు. నెల రోజుల నుంచి వర్షాల జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలో అధిక శాతం భూములు వర్షాధారంగా పండేవే. వారంరోజుల్లో వర్షాలు కురవక పోతే పంటలు పూర్తి దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావి, బోర్ల, వాగులు, వంకలల్లో నీటి సౌకర్యం ఉన్న రైతులు నీటిని పంటలకు అందించేందుకు ఆయిల్ ఇంజన్ ద్వారా, కరెంట్ మోటార్ల ద్వారా నీటిని సకాలంలో అందించలేక నానా అవస్థలు పండుతున్నారు.