⇒ డ్రైవర్లకు కొరవడిన విశ్రాంతి
⇒ అర్ధరాత్రి దాటిన తర్వాత అధిక వేగం
⇒ రాత్రివేళ ప్రయాణాల జోరు
⇒ ‘రెప్ప’పాటులోనే రోడ్డు ప్రమాదాలు
తిరుపతి :
జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో వాహనాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వాహనాల డ్రై వర్లకు తగినంత నిద్ర, విశ్రాంతి లేకపోవడంతో వారు కునుకు తీస్తున్నారు. దీనికితోడు అతివేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నారు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాలూ డ్రైవర్లు కునుకు తీయడంతోనే చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి వద్ద గత వారం బస్సు బోల్తా పడడానికి కూడా డ్రైవర్ కునుకే కారణమని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సు శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి మలుపు వద్ద బోల్తా కొట్టింది. డ్రై వర్ కునుకుతీయడంతోపాటు అతివేగంగా వెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా సోమవారం విజయవాడలో కృష్ణా పుష్కరాలు ముగించుకుని ఇంటికి బయలుదేరిన మదనపల్లె నెహ్రూవీధికి కుటుంబం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిలోని సి.మల్లవరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్ రెండు రోజులుగా నిద్రలేకుండా వాహనాన్ని నడపడంతో కునుకు తీశాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 10 రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన నలుగురు శ్రీవారి దర్శనం కోసం కారులో బయలుదేరారు. వేకువజామున 2 గంటల ప్రాంతంలో డ్రైవింగ్ చేసే వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
రాత్రి సమయంలోనే ఎక్కువ
జిల్లాలో గత ఏడాది సుమారు 1800 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో రాత్రి సమయంలోనే అధిక శాతం జరగ్గా, తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా గత ఏడాదిలో రోడ్డు ప్రమాదంలో 570 మందికి పైగా మతిచెందారు. 1272 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో రాత్రి సమయంలో ప్రమాదం బారిన పడిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు.
తెల్లవారుజామున జాగ్రత్త అవసరం
తెల్లవారజామున 2 నుంచి 6 గంటల వరకు నిద్ర ఆపుకుందామనుకున్నా కష్టం. ఈ సమయంలో నిద్ర ముంచుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. మిగతా సమయంలో ఎలా ఉన్నా ఈ 4 గంటలు డ్రైవర్ పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకుంటే కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చని పేర్కొంటున్నారు.
ఇలా చేస్తే మేలు...
⇒ దూరప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అర్ధరాత్రి దాటిన తరువాత ఎక్కడో ఒక చోట ఆగి నిద్రపోవడం ఉత్తమం.
⇒ 2, 3 గంటలకు ఒకసారి డ్రైవర్‌కు టీ తాగేందుకు అవకాశం ఇవ్వాలి. డ్రై వింగ్ సమయంలో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తుండాలి.
⇒ పోలీస్‌శాఖ పరిధిలో పట్రోలింగ్ వాహనాలు రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తాయి. ఏదో ఒక చోట అర్ధరాత్రి వెళ్లే వాహనాలను తరచూ తనిఖీ చేయడం ద్వారా అందులో ఉన్న వారు అప్రమత్తమవుతారు. దీని ద్వారా కొంతదూరం నిద్రలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. గస్తీ సమయంలో వాహనాలపై వెళ్లేవారు పెద్ద శబ్దాలతో హారన్‌లు మోగించాలి.
⇒ విహారయాత్రకు వెళ్లే కుటుంబ సభ్యులు 6 గంటలు నిద్రపోయేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. డ్రైవర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి నిద్రలేకుండా ప్రయాణం చేయకూడదు.
⇒ ముఖ్యంగా వంతెనలు, లోతట్టు ప్రాంతాల్లో వేగం ఎంత ఉండాలి, రోడ్డు ఉన్న తీరు గురించి తెలిపే బోర్డులను గమనించి డ్రైవర్ వాహనాన్ని నడపాలి.
⇒ వాహనం ముందు సీట్లో కూర్చునేవారు డ్రైవర్ సహా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. తద్వారా ప్రమాదం జరిగితే తీవ్రత తగ్గుతుంది. బెలూన్‌లు తెరుచుకుంటాయి.
ఇవి ప్రమాదాలకు కారణాలు...
⇒ చాలా మంది దైవదర్శనాలకు, విహార యాత్రలకు వెళ్లే వారు సమయాన్ని నిర్ణయించుకుంటారు. ఈ దశలో వాహన డ్రైవర్ రాత్రి అంతా వాహనం నడుపుతారు. సరైన నిద్ర లేక అర్ధరాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
⇒ రాత్రి సమయంలో ఎక్కువగా భోజనం తీసుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో హోటళ్లు, దాబాల్లో దొరికే మసాలా భోజనాలు తీసుకోవడం వల్ల అధిక నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.
⇒ ప్రతి మనిషికీ రోజుకు 6 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకపోవడంతో డ్రైవింగ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేరు.
⇒ రాత్రి సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు నిద్రపోతారు. డ్రై వర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించరు. కొద్ది సమయం బాగానే వాహనం నడిపినా తరువాత మాట్లాడేవారు లేక డ్రైవర్‌కు కళ్లుమూసుకుపోతాయి. దీంతో ప్రమాదాలకు గురవుతారు.
అర్ధరాత్రి డ్రై వింగ్ వద్దు
అర్ధరాత్రి డ్రైవింగ్ మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే కడుపు నిండిపోతుంది. ఈ సమయంలో మెదడకు రక్తం సరఫరా తగ్గి నిద్ర ముంచుకొస్తుంది. ప్రతి రోజూ 6– 8 గంటల నిద్ర పోయిన వారికి ఈ సమయంలో ఏమీ కాదు. డ్రైవర్‌లు దూరప్రయాణాలకు వెళ్లినప్పుడు ఆ మేరకు నిద్ర సాధ్యం కాదు. ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి ప్రయాణాలు మానుకోవడం మంచిది. తప్పని సరి అయితే తెల్లవారుజామున 4 గంటలు విశ్రాంతి తీసుకొని వెళ్లాలి.
–డాక్టర్ వెంకటముని, జనరల్ ఫిజీషియన్