ఆశలు గల్లంతు!
► జిల్లాకు దక్కని రెండో మంత్రి పదవి
► మంత్రివర్గ విస్తరణలోప్రకాశానికి మొండిచేయి
► ఒకే ఒక్కడు శిద్దా రాఘవరావు
► మాగుంటకు మొండిచేయి
► ఫలించని దామచర్ల, డేవిడ్‌రాజుల ప్రయత్నాలు
► డీలా పడిన ఆశావహులు
► ఇన్‌చార్జి మంత్రి రావెలపై వేటు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాజా మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాకు మొండిచేయి చూపారు. సమీకరణలు, కూడికలు.. తీసివేతల తర్వాత ఇన్నాళ్లూ జిల్లాను ఊరిస్తూ వచ్చిన రెండో మంత్రి పదవి చివరి నిమిషంలో చేజారి పోయింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ముఖ్యంగా పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, తీవ్రంగా ప్రయత్నించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు అమాత్య పదవికోసం తనవంతు ప్రయత్నాలు సాగించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు చివరికు నిరాశ మిగిలింది. దీంతో వారి వర్గీయులు డీలా పడ్డారు. జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోడంతో పార్టీ శ్రేణులు ఉసూరుమన్నారు. జిల్లా నుంచి మంత్రి శిద్దా రాఘవరావు కేబినెట్‌లో ఏక్ నిరంజన్‌గా మిగిలారు.
ఫలించని ప్రయత్నాలు..: ప్రకాశం జిల్లాకు తాజా విస్తరణలో రెండో మంత్రి పదవి వస్తుందని పార్టీ నేతలు భావించారు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రాగానే ప్రకాశం జిల్లాకు మంత్రి పదవిపై ఊహాగానాలు అధికమయ్యాయి. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల తన సమీప బంధువైన కేంద్రమంత్రి ద్వారా మంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతును సైతం కూడా గట్టి ఆయన గట్టి ప్రయత్నమే చేసినట్లు సమాచారం. మరోవైపు యర్రగొండుపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు కూడా ఎస్సీ కోటాలో మంత్రి పదవి చేజిక్కి తనవంతు ప్రయత్నాలు సాగించారు. చివరి నిమిషంలో బాబు వీరందరి ఆశల్ని గల్లంతు చేశారు.
మాగుంట వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి..: ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలు వచ్చినప్పటికీ కుల సమీకరణల్లో భాగంగా చివరి నిమిషంలో ఆయనకు పదవి దక్కలేదని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో అదే జిల్లాకు చెందిన మాగుంటకు పదవి దక్కలేదు. ఒక దశలో సోమిరెడ్డికి మండలి చైర్మన్ పదవి కట్టబెట్టి మాగుంటకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆ తరువాత మాగుంటకు మండలి చైర్మన్ పదవి ఇచ్చి సోమిరెడ్డికి మంత్రి పదవి కట్టబెడతారన్న వార్తలు వెలువడ్డాయి. చంద్రబాబు సోమిరెడ్డి వైపే మొగ్గు చూపడంతో మాగుంట ఆశలకు గండి పడింది. దీంతో ఆయన వర్గీయులు నిరాశ చెందారు. అడగక పోయినా పదవి ఇస్తున్నట్లు ప్రచారం చేసిన అధిష్టానం చివరి నిమిషంలో మొండిచేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అనుకూలించని కుల సమీకణలు..: ఇక దామచర్ల గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి వద్దకు తన అనుచరులు వెళ్లి తనకు మంత్రి పదవి వచ్చేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. సమీకరణలు అనుకూలించక పోవడంతో తన సామాజికవర్గానికి చెందిన దామచర్లకు పదవి ఇచ్చేందుకు బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు సామాజికవర్గం నుంచి రిజర్వుడు కోటాలో పోటీ ఎక్కువ ఉండడంతో ఆయన ఆశలూ ఫలించలేదు.
ఒకే ఒక్కడు శిద్దా..: జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వక పోవడంతో ప్రస్తుత మంత్రి శిద్దా రాఘవరావు జిల్లాకు ఒకేఒక్క మంత్రిగా మిగిలారు. ప్రస్తుతం ఆయన పరిధిలో ఉన్న రవాణాశాఖ లేదా రోడ్ల భవనాలశాఖల్లో ఒక దానిని తప్పించి మరో శాఖ అప్పగించనున్నట్లు సమాచారం.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రావెలకు ఉద్వాసన...: ఎట్టకేలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు మంత్రి పదవి ఊడింది. రావెల పనితీరు పట్ల చాలా కాలంగా ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం ఉంది. తాజా విస్తరణలో రావెలను తప్పిస్తారన్న ప్రచారం జోరుగా జరిగింది. అనుకున్నట్టే చివరకు సీఎం ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించారు.