మూడేళ్లు... కాదు రెండేళ్లే..!
– మున్సిపల్ చైర్మన్ సీటుపై వాడివేడిగా చర్చ
– రేసులో ఆసం రఘురామిరెడ్డి, ముక్తియార్
ప్రొద్దుటూరు టౌన్:
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ సీటుపై టీడీపీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ఉండేల గురివిరెడ్డి కొనసాగుతారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చల్లో గురివిరెడ్డికి రెండేళ్లు, మిగతా మూడేళ్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి వర్గీయుడు 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆసం రఘురామిరెడ్డికి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గురువిరెడ్డి తాను మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా పదవి నుంచి దిగే ప్రసక్తే లేదని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా గురివిరెడ్డిని చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు వరదరాజులరెడ్డి వ్యూహం పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దిగాల్సిందే...
ఈ నెల 3వ తేదికి రెండేళ్లు పూర్తి చేసుకున్న చైర్మన్ గురివిరెడ్డి పదవి నుంచి దిగాల్సిందేనని వరదరాజులరెడ్డి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఆయన వర్గీయుల్లో ముఖ్యుడైన ఓ మాజీ కౌన్సిలర్ ద్వారా రెండు రోజుల క్రితం గురివిరెడ్డికి చెప్పినట్లు సమాచారం. ఇందుకు ఆయన ససేమిరా అన్నట్లు తెలిసింది. చైర్మన్ బరిలో ఉన్న ఆసంకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇస్తారో లేదోననే విషయం
చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు జరిగిన 24 మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఏ రోజు కూడా ఆసం సమస్యలపై కానీ, కౌన్సిలర్లతో చర్చించడం కానీ చేయలేదని కొందరు టీడీపీ కౌన్సిలర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో పట్టణంలోని 40 వార్డుల్లో 22 మంది టీడీపీ కౌన్సిలర్లు, 18 మంది వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లలో వీఎస్ ముక్తియార్‌తోపాటు మరో 8 మంది టీడీపీలో ఇటీవల చేరారు. ప్రస్తుతం ఉన్న 22 మంది టీడీపీ కౌన్సిలర్లలో కొంత మంది మినహా మిగిలిన వారంతా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి తరఫున ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో లింగారెడ్డి తన వర్గీయుడైన ముక్తియార్‌ను చైర్మన్ చేసేందుకు కౌన్సిలర్లతో కలిసి పావులు కదుతున్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ కౌన్సిలర్లలో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న లింగారెడ్డి వర్గీయుడు ముక్తియార్ పేరు చర్చకు వస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఏర్పాటు చేయనున్న కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.