నోట్ల కష్టాలు..షరా మామూలే!
పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఇబ్బందులు తొలగడం లేదు. ఇప్పటికీ బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి.
– గ్రామీణ ప్రాంతాల్లో మెరుగవ్వని పరిస్థితి
– ఇప్పటికీ నో క్యాష్ బోర్డులు
పెడుతున్న బ్యాంకులు
– పనిచేయని ఏటీఎంలే అధికం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఇబ్బందులు తొలగడం లేదు. ఇప్పటికీ బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. పనిచేయని ఏటీఎంలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ప్రజల సంఖ్యకు సరిపడ బ్యాంకులు, ఏటీఎంలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తరువాత జిల్లాలోని 445 బ్యాంకుల్లో రూ.5 ,500 కోట్ల రూపాయల పాతనోట్లు జమ అయ్యాయి. అయితే జిల్లాకు వచ్చిన కొత్త నోట్ల విలువ మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే. అందులో రూ.500 నోట్ల రూ. 500కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చిల్లర కష్టాలు ఎక్కువయ్యాయి. కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నగదు దొరక్క ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. పది రోజుల నుంచి పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చినట్లు కనిపించినా..పూర్తిస్థాయిలో మెరుగు పడలేదు.
నగదు పరిమితిని పెంచాలి..
ప్రస్తుతం ఒక్కో ఖాతాదారుడికి బ్యాంకులు వారానికి రూ.24 వేలు ఇస్తున్నాయి. గతంలో బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి రూ.4 వేలే ఇచ్చేవారు. దానిని బ్యాంకుకు వచ్చే డబ్బును బట్టి పది వేల వరకు ఇస్తున్నారు. అయితే వారానికి మాత్రం రూ.24 వేల ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు పరిమితిని రూ.24 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ఏటీఎంలలో రూ.4500 రావడం లేదు...
జనవరి ఒకటో తేదీ నుంచి ఏటీఎంలలో రూ.4500 వచ్చే విధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. గతంలో రూ.2 వేలు మాత్రమే వచ్చేవి. దీంతో డబ్బుల కో సం ప్రజలు ప్రతినీత్యం ఏటీఎంల ఎదుట క్యూలలో నిలబడేవారు. ఈ పరిస్థితిని అధికమించడానికి ఒక్కో డ్రాలో రూ.4500 తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా అది ఎక్కడా అమలు కావడం లేదు. రూ.100, 500 నోట్లు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో నాలుగు వేలే వస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తం...
జిల్లాలో 32 బ్యాంకులకు సంబంధించి 445 బ్రాంచులు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 485 ఏటీఎంలు ఉన్నాయి. అయితే ఇవన్నీ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నోట్ల కష్టాలు తప్పడంలేదు. ప్రజల సంఖ్యకు అనుగుణంగా బ్యాంకులు, ఏటీఎంలు లేకపోవడంతో నేటికి వారికి అవసరమైన నగదు అందుబాటులోకి రావడం లేదు. ఎక్కువగా రైతాంగం జీవనం సాగిస్తుండడంతో పంటల సాగుకు ఇబ్బందిగా ఉంది. మరోవైపు రైతుల అమ్మిన సరుకుకు కూడా మార్కెట్లలో నగదు ఇవ్వడంలేదు. దీంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా ఉంది.
చిల్లర లేక చిరు వ్యాపారుల అవస్థలు..
ప్రస్తుతం రూ.2 వేల నోట్లు ఎక్కువ చలామణిలో ఉన్నాయి. దీంతో చిల్లర సమస్య నెలకొంది. చిల్లర లేక చిరు వ్యాపారులు.. వ్యాపారాన్ని వదులుకుంటున్నారు. చిల్లర సమస్యను పరిష్కరించడానికి రూ.500 నోట్లను ఎక్కువగా చలామణిలోకి తేవాలని వ్యాపారులు కోరుతున్నారు.