ఇక ఎంతకాలమైనా భూముల లీజు
- 33 సంవత్సరాల గరిష్ట కాలపరిమితి ఎత్తివేత
- ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఎన్నేళ్లకైనా లీజుకిచ్చేలా విధానంలో సవరణ
- రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు
- మినుము, పెసరకు అదనంగా రూ.వెయ్యి మద్దతు ధర
- కరువు మండలాలపై పునఃపరిశీలన
- ఇసుక, ఎర్రచందనం అక్రమరవాణా నిరోధానికి సీసీ కెమెరాలు
- ప్రభుత్వ మద్యం షాపులూ ప్రైవేటు వ్యక్తులకే..
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల లీజు విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల లీజుకు సంబంధించి 33 సంవత్సరాల గరిష్ట కాల పరిమితిని ఎత్తివేయనుంది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంతకాలమైనా భూములను లీజుకు తీసుకునేందుకు (ఫ్రీ హోల్డింగ్) వీలుగా విధానాన్ని సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు సీఎం చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులు మీడియాకు వెల్లడించారు. 33 సంవత్సరాల లీజు పరిమితి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా విధానాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలిపారు.
ఇతర నిర్ణయాలు..
► నవంబర్ నెలలో కేజీ కందిపప్పును.. రూ.140 మార్కెట్ రేటులో మూడో వంతును సబ్సిడీగా ఇచ్చి సరఫరా చేయాలి.
► రూ.5,100 ఉన్న మినుము, రూ.5,850 పెసర పంటల మద్దతు ధరను మరో వెయ్యి రూపాయలు పెంచాలి.
► రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాల ఎంపికపై పునఃపరిశీలన జరపాలి. 13 జిల్లాల్లో ఇంకా ఎక్కడ వర్షాభావం ఉందో చూసి అవసరమైతే కరువు మండలాల సంఖ్యను పెంచి అక్కడ 150 రోజుల పని దినాలను కల్పించాలి.
► రెవెన్యూ శాఖ ఇప్పటివరకు జారీ చేస్తున్న 67 సర్టిఫికెట్లను గణనీయంగా త గ్గించాలి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారికి ఇకపై ఆధార్, రేషన్ కార్డును బట్టి సర్టిఫికెట్లు మంజూరు చేయాలి.
► మార్చిలోపు సాధ్యమైనంతమంది ఉద్యోగులను రాజధానికి తీసుకురావాలి. జూన్‌లోపు అందరినీ తరలించాలి. మేథా టవర్స్‌లో కొన్ని కార్యాలయాలు, విజయవాడ బందరు రోడ్డులోని 1.5 ఎకరాల ఆర్ అండ్ బీ స్థలంలో నాలుగు నెలల్లో భవనాలు నిర్మించి కొన్ని శాఖలు తరలించాలి. ఉద్యోగులకు వసతిపై కేబినెట్ సబ్‌కమిటీ జూన్ లోపు నిర్ణయం తీసుకుంటుంది. ఏప్రిల్‌లోపు రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించాలి.
► ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు శేషాచలం అడవుల్లో రూ.18 కోట్లతో 299 సీసీ కెమెరాల ఏర్పాటు.
► ఇసుక రీచ్‌లలో అక్రమాల నివారణకు 370 సీసీ కెమెరాల ఏర్పాటు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ఆర్డీఓ హైమావతిని ప్రత్యేక అధికారిగా నియమించాలి. ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి.
► కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 25న పది లక్షల మొక్కలు నాటాలి.
► 110 మున్సిపాల్టీల్లో అనధికారికంగా ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న అర్హులైన పేదలకు పట్టాలివ్వాలి.
► ఎక్సైజ్ విధానాన్ని మార్చాలి. ప్రభుత్వం నిర్వహించాలనుకున్న 438 షాపులకు కూడా వేలం నిర్వహించి ప్రైవేటు వారికి అప్పగించాలి. వారంలో వేలం నోటిఫికేషన్ విడుదలకు చర్యలు.
7వ తేదీలోగా కాపు కార్పొరేషన్
బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఈ కమిషన్ సమగ్రంగా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వాలి. నవంబర్ ఏడో తేదీలోపు రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి.
► జలవనరుల యూనివర్సిటీ ఏర్పాటు గురించి సమగ్ర వివరాలను సేకరించాలి. వచ్చే సోమవారం దీనిపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి.
► 9, 10 తేదీల్లో హెచ్‌ఎంఎస్ ఫేజ్-2, గాలేరు-నగరి ప్రాజెక్టుల వద్ద సీఎం బస కార్యక్రమం.
► ఆత్మహత్య చేసుకున్న నాగార్జునవర్సిటీ విద్యార్థిని కుటుంబానికి మోరంపూడి శాటిలైట్ టౌన్‌షిప్‌లో రూ.500 గజాల స్థలం మంజూరు.
► మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు 183 ఎకరాల కేటాయింపు.
► చిత్తూరు రేణిగుంట సమీపంలోని కుకివాకం దగ్గర ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 1.5 ఎకరాలను ఎకరం రూ.80 లక్షల చొప్పున కేటాయింపు.