- ∙మద్యం మత్తులో పలువురితో అసభ్యకర ప్రవర్తన
- ∙మూడు నెలల పాటు సస్పెన్షన్ ?
- ∙సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఆఫీసర్స్ క్లబ్‌లో సభ్యుడి హల్‌చల్
Published Mon, Aug 8 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
వరంగల్ : వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో మూడు రోజుల క్రితం కొంతమందితో గొడవకు దిగిన ఓ సభ్యున్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వరంగల్ నగరంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకుగానూ ఈ నెల 4న ఓ సభ్యు డు కుటుంబసమేతంగా వచ్చి, ఆఫీసర్స్ క్లబ్‌లోని గదిలో బస చేశాడు. అదే రోజు క్లబ్‌లో ఉన్న మరో సభ్యుడు వారితో దురుసుగా మా ట్లాడాడు. అంతటితో ఊరుకోకుండా పోలీసులను పిలుచుకొని వచ్చి సదరు కుటుంబ సభ్యుల వివరాలను ఆరా తీయించాడు. వారు వివాహానికి వచ్చారని ధ్రువీకరణ కావడంతో పోలీసులు వెళ్లిపోయారు. మద్యం మత్తులో మళ్లీ అర్ధరాత్రి వచ్చి రూమ్ తట్టి లేపి మరీ బస చేసిన కుటుంబీకులను యక్షప్రశ్నలతో వేధిం చాడు. క్లబ్ సిబ్బంది జోక్యం చేసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించారు. అయితే క్లబ్‌లో బస చేసిన కుటుంబానికి సైతం రాజకీయ పలుకుబడి ఉండటంతో.. వారు సీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఘటనపై దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫీసర్స్ క్లబ్‌లో బస చేసిన కుటుంబీకులు తమతో గొడవకు దిగిన వ్యక్తిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే దీని నుంచి ఎలాగోలా బయటపడేందుకు సదరు వివాదాస్పద సభ్యుడు పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు అధికార పార్టీలోని ప్రముఖ నాయకుడికి సంబంధించిందని ఆలస్యంగా తెలియడంతో.. ప్రస్తుతం సదరు ప్రజాప్రతినిధులు కూడా గొడవకు దిగిన సభ్యుడి తరఫున పైరవీలు చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసభ్యంగా ప్రవర్తించిన సభ్యున్ని క్లబ్ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని క్లబ్ కార్యవర్గం నిర్ణయించినట్లు పలువురు పేర్కొంటున్నారు. అతడి సభ్యత్వాన్ని పూర్తిస్థాయిలో తొలగించడంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
Advertisement