ఖరీఫ్ సీజన్ మొదలైంది..సాగు సమయం మొచ్చింది.. రైతన్నకు దిశానిర్దేశనం చేయాల్సిన అధికారులు ‘పొలంబాట’ మరిచారు.
- పొలంబాట పట్టని అధికారులు
- వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల మధ్య పెరిగిన అంతరం
- కనిపించని శాస్త్రవేత్తల జాడ
- రైతులకు ఖరీఫ్‌సాగు, ప్రత్యామ్నాయంపై సలహాలు కరువు
- సీజన్‌లో సూచనలు ఇచ్చేవారులేక రైతుల అయోమయం
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ మొదలైంది..సాగు సమయం మొచ్చింది.. రైతన్నకు దిశానిర్దేశనం చేయాల్సిన అధికారులు ‘పొలంబాట’ మరిచారు. వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల మధ్య అంతరం పెరిగింది. ఎక్కడా శాస్త్రవేత్తల దర్శనం లేదు. ఏ నేలలో ఏ పంట సాగు చేయాలో..ఏ మందు వాడాలో తెలియక రైతన్నలు అయోమయంలో ఉన్నారు.
= జిల్లాకు కే–6 రకం వేరుశనగ అనువైందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తుంటే.. రాయితీ రైతులందరికీ కే–6 రకం పంపిణీ చేశారు. కాదు... కాదు కే–9, ధరణి రకం బాగుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వారిచ్చే సిఫార్సుల్లో కే–6 రకం లేదు.
= ట్రైకోడెర్మావిరిడీతో విత్తనశుద్ధి చేసుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తారు.. విత్తనంతో పాటు పెద్ద ఎత్తున విరిడీ పౌడరు పంపిణీ చేశారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం మాంకోజెబ్, ఇమిడాక్లోప్రిడ్, టిబుకొనజోల్ లాంటి మందులతో విత్తనశుద్ధి పాటించాలని వల్లె వేస్తారు.
ఈ రెండు అంశాలను పరిశీలిస్తే వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక రైతులు పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైతులకు చేసే సూచనలు, సిఫార్సులు, సాంకేతిక సలహాలు, ఇతరత్రా సమగ్ర యాజమాన్య పద్ధతుల విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఖరీఫ్ కష్టాలతో సతమతం :
కరువు పరిస్థితులకు ఆలవాలమైన ‘అనంత’ రైతులకు దిశా నిర్ధేశనం చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తలోదారిలో వెళ్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జిల్లాలో 9 లక్షల హెక్టార్లకు పైగా మెట్ట ప్రాంతం ఉండటం వల్ల వర్షం వస్తే కాని ఖరీఫ్ పంటలు సాగు చేయలేని దయనీయ పరిస్థితి.అయితే వర్షాలు కురవకపోవడం, కురిసినా అదనులో పడకపోవడం వల్ల ఏటా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు బాగా పడినా నాసిరకం విత్తనం లేదా చీడపీడలు ఆశించడం వల్ల పలుమార్లు పంటలు దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి.
జిల్లాలో ఉన్న 63 మండలాల్లోనూ ఒకటే పరిస్థితి. ఓ వైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకుల కరుణ లేకపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఏటా పెట్టుబడుల రూపంలోనే రూ.వందల కోట్లు కోల్పోతుండగా దిగుబడుల రూపంలో రూ.వేల కోట్ల నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ సారి కూడా పరిస్థితి మరింత ఘోరంగా ఉండటంతో రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది.
తలోదారిలో అధికారులు, శాస్త్రవేత్తలు.. :
భౌడం, ప్రధాన పంటకాలం ముగిసిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలు ఏవి అనుకూలం, ఎప్పుడు వేసుకోవాలని చెప్పాల్సిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఇటీవల కాలంలో కలిసి పనిచేయలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో కొందరు రైతులు జూన్ మొదటి వారంలోనే వేరుశనగ వేస్తున్నారు. మరికొందరు జూలై, ఆగస్టులోనూ వేస్తున్నారు. అంటే వేరుశనగ పంట కాలంలో చాలా అంతరం కనిపిస్తోంది. మిగతా పంటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
పొలంబాట మరచిపోయిన అధికారులు :
ఖరీఫ్ ప్రారంభానికి నెల నెలన్నర ముందే అధికారులు, శాస్త్రవేత్తలు నాలుగైదు సార్లు సమావేశమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రైతులను సరైన దిశలో నడిపించాల్సి ఉన్నా అది జరగడం లేదు.ఈ ఖరీఫ్‌లో ఇంతవరకు ఒకసారి కూడా సమావేశమై కలిసి చర్చించని పరిస్థితి.అధికారులు పొలం బాట పట్టే పరిస్థితి లేదు.శాస్త్రవేత్తలు కూడా గ్రామాలకు వెళ్లి పంట స్థితిగతులు అంచనా వేసి సరైన సూచనలు, సిఫార్సులు చేసే పరిస్థితి కనిపించలేదు.ఒకటి ఆరా మినహా ఎవ్వరూ రైతులకు ఉపయోగపడే రీతిలో మార్గదర్శకం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఏరువాక కేంద్రం (డాట్‌సెంటర్), కదిరి, రేకులకుంటలో వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఏఆర్‌ఎస్), రెడ్డిపల్లి, కళ్యాణదుర్గంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) ఉన్నాయి. అందులో అనుభవం కలిగిన సీనియర్ శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో నిపుణలు, టెక్నికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అధికారుల విషయానికి వచ్చినా జేడీఏ నుంచి డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, ఎంపీఈవోలు...ఇలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.కానీ..ఎక్కడా అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి రైతులకు సూచనలు, సిఫారసులు చేసే పరిస్థితి లేకపోవడంతో ‘అనంత’ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.