రాజంపేటలోని పాతబస్టాండులో నూనెల వ్యాపారి మహమ్మద్‌రఫీ (35) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజంపేట: రాజంపేటలోని పాతబస్టాండులో నూనెల వ్యాపారి మహమ్మద్‌రఫీ (35) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు ఆయన భార్య షమీమ్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రెడ్డప్ప పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు, అక్కడున్న పరిస్థితులను బాధితులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసుకున్నారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రఫీ, షమీమ్ మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటకు చెందిన వారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహం అయింది. ముగ్గురు సంతానం ఉన్నారు. రాజంపేట పట్టణానికి వచ్చి నూనె వ్యాపారం చేసుకుంటున్నారు. బ్యాంకులో రూ. 43 లక్షల అప్పు ఉందని రఫీ మనోవేదనకు గురయ్యే వాడు. చెల్లిస్తానో, లేదోనేనే అనుమానాల నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. రఫీ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.