పాతనోట్లు.. కొత్తపాట్లు
పాతనోట్లు.. కొత్తపాట్లు
Published Sun, Mar 5 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM
సత్యదేవుని హుండీల్లో రూ.3.60 లక్షల పాతనోట్లు
డిపాజిట్ చేసుకోని బ్యాంకులు
ఆర్‌బీఐకి లేఖ రాసిన దేవస్థానం అధికారులు
అన్నవరం : జనవరి, ఫిబ్రవరి నెలల్లో సత్యదేవుని హుండీలలో భక్తులు సమర్పించిన రూ.3.60 లక్షలు విలువైన రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు భవితవ్యం ఏమిటి?. వీటిని రిజర్వ్‌బ్యాంక్ తీసుకుని కొత్తనోట్లు ఇస్తుందా?. మార్చి తర్వాత కూడా హుండీల్లో పాతనోట్లు వస్తే ఏమిచేయాలి అనే విషయాలపై అన్నవరం దేవస్థానం వర్గాలు సతమతమవుతున్నాయి. బ్యాంకులు తీసుకోకపోవడంతో రూ.3.60 లక్షల విలువైన పాతనోట్లను దేవస్థానం ఖజానాలో భద్రపరిచారు. గతేడాది నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి పాతనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరు వరకు పాతనోట్లను వాణిజ్యబ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పిడి చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆ నోట్లను తీసుకుంటుదని ప్రకటించారు. పాతనోట్ల రద్దు తర్వాత నవంబర్‌లో రెండుసార్లు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో ఒక్కోసారి సత్యదేవుని హుండీలను తెరిచారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చిన సుమారు రూ.25 లక్షల విలువైన పాతనోట్లను బ్యాంకులు డిపాజిట్ చేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన నోట్లను మాత్రం తీసుకోలేదు.
బ్యాంకుల నిరాకరణ
జనవరిలో స్వామివారి హుండీలను తెరవగా రూ.1.70 లక్షలు విలువైన పాత రూ.500, రూ.వెయ్యినోట్లు వచ్చాయి. ఫిబ్రవరిలో రూ.1.90 లక్షలు విలువైన పాతనోట్లు వచ్చాయి. ఈ రెండు నెలల హుండీ ఆదాయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకుల్లో జమచేశారు. వాటిలో పాతనోట్లను ఆ బ్యాంకులు తీసుకోకపోవడంతో దేవస్థానం ఖజానాలోనే భద్రపరిచారు. పాతనోట్లను తీసుకుని కొత్తవి మంజూరు చేయాలని అన్నవరం దేవస్థానం అధికారులు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై బ్రాంచ్ అధికారులకు గత నెలలో లేఖ రాశారు. దీనిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీల్లో వచ్చిన పాతనోట్లను తీసుకోవడానికి ఆర్‌బీఐ నిరాకరించినట్టు తెలియడంతో దేవస్థానం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement