- రుణాల మంజూరులో చేతులెత్తేసిన బ్యాంకులు
- 2016–17 రుణ ప్రణాళిక కొండెక్కినట్లే
- తీవ్ర నగదు కొరతతో రూ.7800 కోట్ల రుణాలు మంజూరు సాధ్యమేనా!
కర్నూలు(అగ్రికల్చర్): అవసరాల్లో ఆదుకునే బ్యాంకులు నిర్వీర్యమవుతున్నాయి. భరోసా ఇస్తాయనే నమ్మకం పోతోంది.పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకుల్లో తీవ్ర నగదు కొరతతో మొత్తం బ్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. లావాదేవీలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రెండు రోజులు 40 రోజులుగా ఇంతే. కనుచూపు మేరలో నగదు కష్టాలు తీరే మార్గం కనిపించడం లేదు. బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో 2016–17 రుణ ప్రణాళిక కొండెక్కినట్టేనని అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది రూ. 7800 కోట్లుతో రుణ ప్రణాళికను తయారు చేసినా ఆచరణలో ఎలాంటి పురోగతి లేదు. కీలకమైన తరుణంలో నోట్ల రద్దు రూపంలో ఉపద్రవం వచ్చి పడటంతో అన్ని వర్గాలపై ఈ ప్రభావం పడింది. రైతులకు, ఇతర అన్ని వర్గాల వారికి రుణాల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బ్యాంకుల్లో నిరంతరం నో క్యాష్ బోర్డులు పెడుతుండటాన్ని చూస్తే రైతులకు, వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాలు ఇవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం అవుతోంది.
ప్రభుత్వానికి భారీగా తగ్గిన ఆదాయం:
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా పడిపోతోంది. వెరసి రూ.500, 1000 నోట్ల రద్దతో ఏర్పడిన కరెన్సీ కొరతతో జిల్లా అభివృద్ధి తిరోగమనంలోకి ఽపయనిస్తోంది. నగదు రహిత లావాదేవీలకు స్పందన లేకుండా లేదు. జిల్లా అధికారులే నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆచరణలో ప్రజల్లోకి వెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తవుతోంది. దాదాపు 25 రోజులుగా ఆన్‌లైన్ లావాదేవీలు అంటున్నా ఇప్పటి వరకు ఆ దిశగా జరుగుతున్న లావాదేవీలు కేవలం 10 శాతంలోపే ఉండటం గమానార్హం.
రుణం.. అందనంత దూరం:
బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో రుణాల పంపిణీ పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి బ్యాంకులు వివిధ రకాల రుణాలు ఇస్తాయి. ప్రధానంగా రైతులకు పెట్టుబడుల నిమిత్తం పంట రుణాలు ఇస్తాయి. 2016–17లో వ్యవసాయ రంగానికి రూ.5129.61 కోట్లు పంపిణీ చేయాలన్నది లక్ష్యం. రైతులకు పంట రుణాలు, ప్రోడ్యూస్ లోన్‌లు, టర్మ్ లోన్‌లు, వ్యవసాయ యాంత్రీకరణ, గోదాముల నిర్మాణం, భూముల అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటికి రుణాలు ఇచ్చే విధంగా జిల్లా రుణ ప్రణాళికను రూపొందించారు. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో ఖర్చులకు అవసరమైన పైసలు కూడా లభ్యం కావడం లేదు. దాచుకున్న డబ్బుల్లో నెలకు రూ.10వేలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ రంగానికి రుణ ప్రణాళిక మేరకు రూ.5129.61 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రభుత్వ పథకాలకు కష్టమే:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా నిరుద్యోగ యువత స్వయం ఉపాధిలో రాణించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూనిట్లు గ్రౌండింగ్ చేయాలంటే బ్యాంకు రుణం అత్యవసరం. అంతేగాక చేనేతకారులు, మత్స్యకారులు, పట్టువరిశ్రమ, పశుసంవర్థక శాఖ తదితర అన్ని పథకాలకు బ్యాంకు రుణాలు అవసరమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలలు ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే బ్యాంకులే ఆధారం. సూక్ష్మ, చిన్న, మద్య, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా బ్యాంకు రుణాల అవసరం ఉంది. 2016–17లో వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ధ్యీ) పరిశ్రమలు ఏర్పాటు, ప్రాధాన్యత రంగం తదితర వాటికి రూ. 7800 కోట్లు రుణాలుగా ఇవ్వాలనే రుణ ప్రణాళిక లక్ష్యం. బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు పెడుతుండటంతో రుణ ప్రణాళిక ఈ సారి కొండెక్కినట్లేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ప్రతి ఒక్కరి ఆర్థిక ఎదుగుదల బ్యాంకులతో ముడిపడి ఉంది. 40 రోజులుగా బ్యాంకులు నగదు లేక మనుగడ కోల్పోయో ప్రమాదం ఏర్పడింది. రుణాల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా పథకాల కింద న్రభుత్వం విడుదల చేసిన సబ్సిడీ పూర్తిగా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఏర్పడింది.
400 బ్రాంచ్‌ల్లో డబ్బుల్లేవ్....
జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా 445 బ్రాంచీలు ఉన్నాయి. గతంలో ఎపుడూ లేని విధంగా బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో 400 బ్రాంచ్‌ల్లో నగదు నిల్వలు జీరో ఉన్నయంటే ఆ బ్యాంకుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారయిందో ఊహించవచ్చు. 96 శాతం ఏటీఎంలు దాదాపు 40 రోజులుగా మూతపడ్డాయి.