బ్యాంకు ఎదుట వృద్ధులు
– బారులు తీరలేక సొమ్మసిల్లుతున్న వృద్ధులు
– ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని మనవి
ఎమ్మిగనూరు: నోట్ల పాట్లు వయోవృద్ధులకు తప్పలేదు. వణుకుతూ.. తడబడుతూ.. బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. క్యూలో నిరీక్షించి నీరిస్తున్నారు. దాహంతో తల్లడిల్లి, ఆకలితో అలమటిస్తూ ఆపసోపాలు పడుతున్నారు. పొద్దుపొడుపుతో బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. పొద్దు గూకే దాక నోట్ల మార్పిడి కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. పాపం యువకులతో పోటీ పడలేక, గంటల తరబడి వేచి ఉండలేక ఉన్నచోటనే సొమ్మసిల్లుతున్నారు. వికలాంగులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. ఈ నెలలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో దాదాపు 35 వేల పైగా వృద్ధులు, వికలాంగులు పింఛన్లు పొందారు. అందరికీ పాత నోట్లతో పింఛన్లు అంటగట్టారు. నెలనెలా ఆసరాతో పోగు చేసుకున్న డబ్బు సైతం పనికిరాకుండా పోయింది. పూట గడవని బతుకులు కడుపుమాడ్చుకుని క్యూ కడుతున్నారు. నోట్ల మార్పిడి కోసం వృద్ధులు, వికలాంగులు బ్యాంకుల వద్దకు తరలివస్తున్నారు. బ్యాంకులతో బారులు తీరలేక గంటల తరబడి నిరీక్షించలేక యాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఎస్‌బీఐ, ఏడీబీ,ఆంధ్రబ్యాంక్,గోనెగండ్ల, మంత్రాలయం, కోసిగి ఎస్‌బీఐ, రాయలసీమ గ్రామీణ బ్యాంకులతో రద్దీ ఎక్కువగా ఉంది.