ఆ భారీ మొత్తం వెనుక పెద్దలెవరు?
Published Thu, Dec 8 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
కొవ్వాడ వద్ద నోట్ల పట్టివేత వ్యవహారంలో పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు
వీఆర్‌లోకి ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్‌ఎస్సై శంకరప్రసాద్ సహా ముగ్గురు కానిస్టేబుళ్లు
కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ కొవ్వాడ రైల్వే గేటు సమీపంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్దనోట్ల పట్టివేత వ్యవహారంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పెద్దనోట్లను కాకినాడకు చెందిన ఓ వైద్యుని ఇంటికి తరలిస్తున్నట్లు వెల్లడికావడంతో తరలిస్తు్తన్న వ్యక్తుల నుంచి పోలీసులు బేరసారాలకు దిగి రూ. 5 లక్షలు లంచం తీసుకుని,అసలైన నిందితులను విడిచిపెట్టేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమపర్వానికి సంబంధించి విశ్వసనీయంగా తెలిసిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 4న రాత్రి కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్‌ఎస్సై శంకరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం–పైన రహదార్లో వాహనాల తనిఖీ చేపట్టారు. మాచవరం నుంచి కాకినాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తు్తన్న పెద్ద నోట్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పెద్దనోట్ల నగదు పట్టివేత, స్వాధీనంపై పోలీసులు అత్యంత గోప్యత పాటించారు. భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ నగదు స్వాధీనంపై సోమ, మంగళవారాల్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు అలా చేయకపోవడం ఆరోపణలకు ఊతమిచ్చింది. నగదు పట్టివేత, కేసు నమోదులో పోలీసుల వైఖరి పలు సందేహాలకు తావిచ్చింది. అక్రమ నగదు పట్టివేతపై పోలీసులపై ఆరోపణలు రావడాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నోట్ల పట్టివేత వ్యవహారంలో సిబ్బంది సొమ్ములకు ఆశపడి అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో కాకినాడ ఒకటో పట్టణ ట్రాఫిక్ ఆర్‌ఎస్సై శంకరప్రసాద్, ముగ్గురు కానిస్టేబుళ్లు గంగాధర్, ప్రసాద్, పరశురాంరెడ్డిలను వీఆర్‌లోకి పంపుతూ ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వీరిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న పెద్దనోట్లను ఎవరి దగ్గరకు తీసుకెళుతుండగా పట్టుకున్నారు, ఎంత మంది అక్రమ రవాణాలో పాల్గొన్నారన్నది తెలుసుకుని, పట్టుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement